అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3000 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి.. సీఎం కేసీఆర్‌

అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3000 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి.. సీఎం కేసీఆర్‌

జనం న్యూస్ 26 మే 2023 :--ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గృహ లక్ష్మి పథకం కింద మూడు వేల మందిని ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. జూన్ రెండో తేదీ నుంచి మూడు వారాలు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో సీఎం కే చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు.ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గృహ లక్ష్మి పథకం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.నియోజకవర్గానికి 3000 చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఇంటి నిర్మాణంలో ఆయా దశలను ఫోటోలు తదితర మార్గాల ద్వారా నిర్ధారించుకుని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు దశలవారీగా గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సొంత జాగాలు ఉన్న లబ్ధిదారులకు మొదటి దశ అనగా బేస్ మెంట్ దశలో రూ.లక్ష, స్లాబ్ దశలో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన ఆఖరి దశలో మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ.3 లక్షలు అంద జేయాలని సీఎం తెలిపారు.ఇందుకు సంబంధించిన నిర్థిష్ట విధి విధానాలను రూపొందించి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమపద్దతిలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని సిఎం తెలిపారు.గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి దశలవారీగా అమలు చేయాలని సీఎం తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు....  జనం న్యూస్ రిపోర్టర్ గట్టు మండలం