ఆక్సిడెంట్ చేసి కారు వదిలేసి ఆటోలో పారిపోయిన నటుడు.. సి.సి కెమెరాకు దొరికిపోయాడు.

జనం న్యూస్: నిత్యం రోడ్డు ప్రమాదాల వార్తలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంట్లో నుండి అడుగు బయట పెడితే, సేఫ్‌గా తిరిగొస్తామనే గ్యారెంటీ లేదు. మనం జాగ్రత్తగానే ఉన్నా, ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందో ఊహించలేం. కళ్లు తెరిచిలోగా, క్షణాల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇటీవల కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ బంధువు, శాండల్‌వుడ్ యంగ్ యాక్టర్ సూరజ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని కుడి కాలు నుజ్జు నుజ్జు అవడంతో తీసెయ్యవలసి వచ్చింది. ఇప్పుడు ఓ యూట్యూబర్ యాక్సిడెంట్ చేసి, ఎస్కేప్ అయిన న్యూస్ రీసెంట్‌గా వెలుగులోకి వచ్చింది. టీటీఎఫ్ వాసన్ తమిళనాట యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, ‘మండల్ వీరన్’ అనే సినిమాలో ఏకంగా హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా వాసన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటాడు. ఆ మధ్య బైక్ మీద ఓవర్ స్పీడ్‌తో వెళ్తూ పోలీసుల చేత చివాట్లు తిన్నాడు. ఇప్పుడు కారులో వేగంగా వెళ్తూ డివైడర్‌ని ఢీ కొట్టడంతో కారు అదుపుతప్పి ముందరున్న బైక్‌ని ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కింద పడడంతో గాయాలయ్యాయి. కార్ ముందు భాగం కొద్దిగా డ్యామేజ్ అయింది. అయితే సంఘటన జరగ్గానే భయపడిపోయిన వాసన్, తన కార్‌ని అక్కడే వదిలేసి ఆటో ఎక్కి పారిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వాసన్ మీద ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.