ఇవేం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు. చూస్తే షాక్ అవుతారు.

ఇవేం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు. చూస్తే షాక్ అవుతారు.

జనం న్యూస్: ప్రకృతిలో వింతకు విచిత్రాలకు కొదవ లేదు. సృష్టికి భిన్నంగా జరుగుతూ మనల్ని వింతైన లోకంలోకి తీసుకెళుతుంటాయి. వింత ఆకారాలతో మనుషులు, పశు పక్షాదులు పుట్టడం, ప్రకృతికి విరుద్ధంగా సంఘటనలు జరుగుతుండటం చూస్తూనే ఉంటుంటాం. జన్యుపరమైన లోపమా లేక శాస్త్రాన్ని మించిన అంతు చిక్కని మిస్టరీ ఉందో తెలియదు కానీ.. కొన్ని కొన్ని చూస్తుంటే మన కళ్లను మనం నమ్మలేని స్థితిలో ఉంటాయి. అటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు మనకు సమీపంగా జరిగితే.. తండోప తండాలుగా ఎగబడి చూస్తుంటాం. అలాంటి వాటిల్లో కొన్ని ఇవిగో. మీకు తెలిసి కొబ్బరి చెట్టుకు ఎన్ని కొమ్మలు ఉంటాయి. ఏంటీ ఆ తిక్క ప్రశ్న అసలు.. కొమ్మలు ఉంటాయా అనుకుంటున్నారా.. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కొబ్బరి చెట్టుకు ఆరు కొమ్మలు ఉన్నాయి. ఆకివీడు మండలం పెదకాపవరం పంచాయతీ పరిధిలోని గంటలరాయుడుపేటలో అటువంటి వింత చెట్టు ఉంది మరీ. కఠారి శ్రీనివాస్‌కి చెందిన చేపల చెరువు గట్టుమీద ఒక కొబ్బరి చెట్టుకు ఆరు కొమ్మలు వచ్చాయి. సాధారణంగా కొబ్బరి చెట్టు ఏపుగా ఎదుగుతుంది.. కానీ కొమ్మలు ఉండవు. కానీ ఈ చెట్టు ఆరు కొమ్మలు, తలలు ఉన్నాయి. మొక్కను పాతేటప్పుడు మామూలుగానే ఉందని, పెరిగే సమయంలో ఆరు కొమ్మలు ఏర్పడ్డాయని యజమాని శ్రీనివాస్ చెప్తున్నారు.జీలుగుమిల్లి మండలం, ఉదయభాస్కర కాలనీలో గొల్లపల్లిలో వింతైన మేక ఆశ్చర్య పరుస్తుంది. ఎందుకంటే దానికి మూడు కాళ్లు ఉండటమే. రవి అనే వ్యక్తి ఇంట్లో ఈ మేక ఉంది. తల్లి మేక ఇటీవల రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒకటి నాలుగు కాళ్లతో పుడితే, మరొకటి మూడు కాళ్లతో పుట్టింది. మూడు కాళ్లతో పుట్టిన మేక కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటు మేత చక్కగా మేస్తూ ఉంది. దీన్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు ప్రజలు. జన్యుపరమైన లోపాల వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ వైద్యులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. అరటి గెల పండిన తరువాత నరికి వేసిన చెట్టు నుండి మరో గెల వచ్చింది. మామాలుగా ఒక అరటి చెట్టు ఒక గెల మాత్రమే వేస్తుంది. కానీ నరికేసిన చెట్టు నుండి మళ్లీ అరటి గెల వచ్చింది. అండలూరు గ్రామానికి చెందిన మేడిచర్ల శ్రీమన్నారాయణ పెరటి తోటలో అరటి చెట్లను పెంచుతున్నాడు. ఒక అరటి చెట్టు వేసిన గెల తయారు కావడంతో అరటి గెలను కోసి తరువాత చెట్టును కూడా నరికివేసాడు. నరికేసిన అరటి చెట్టు మధ్యలో నుండి మరో అరటి గెల వచ్చింది. నరికేసిన అరటి చెట్టు నుండి మరో గెల రావడాన్ని స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.