పాపం.. బైకుపై తల్లి శవంతో 80కిలో మీటర్ల ప్రయాణం.. అసలేం జరిగింది..? (వీడియో చూడండి)

జనం న్యూస్: దేశం పురోగతి దిశగా ముందుకు వెళ్తున్నదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రతిబింబిస్తున్నాయి. తల్లి శవాన్ని సొంత గ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వ అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో తరలించే స్థోమత లేక కన్నకొడుకు బండిపై మోసుకుని 80 కిలోమీటర్లు ప్రయాణించిన ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి రావడంతో అసలు మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న మరోసారి తలెత్తింది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ప్రజలు, మేధావి వర్గం కోరుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుడారులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే. తల్లికి ఆరోగ్యం బాలేక పోవడంతో కొడుకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అయితే, ఆమె మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్సు అందుబాటులో లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాలంటే రూ.5000 అవసరం. అతని వద్ద అంత డబ్బులు లేవు. దీంతో తన వద్ద ఉన్న రూ.100తో ఒక చెక్క కొని దానిని బైకు మధ్యలో పెట్టి తల్లి మృతదేహాన్ని దానిపై పడుకోబెట్టుకుని 80 కిలో మీటర్లు ప్రయాణం ప్రారంభించాడు. దారిమధ్యలో కొందరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూసినా అక్కడి ప్రభుత్వాలు సీతకన్ను వేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇదిలాఉండగా చికిత్స సమయంలో ఆస్పత్రి వైద్యులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే తన మిత్రుని తల్లి మరణించిందని బాధితుడి స్నేహితుడు ఆరోపించాడు. ఈ విషయంలో ఆస్పత్రి సిబ్బందితో బాధిత కుటుంబం వాగ్వాదానికి దిగినట్టు కూడా తెలిసింది.