ప్రభుత్వ ఆరోగ్య శాఖలో తేడా పనులు

ప్రభుత్వ ఆరోగ్య శాఖలో తేడా పనులు

జనం న్యూస్ 10 జూలై 2024. కిందిస్థాయి మహిళా సిబ్బంది పై లైంగిక వేధింపులు..
ఉన్నతాధికారులకు పలు సందర్భాల్లో ఫిర్యాదులు.
షాద్ నగర్ నియోజక వర్గంలోని ఓ ప్రభుత్వ వైద్య కేంద్రంలో మహిళా సిబ్బందికి వేధింపులు 

ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణం పోసి సృష్టిలో దేవుడి తర్వాత అంతటి హోదాను సొంతం చేసుకున్న వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. అందుకే వైద్యో నారాయణ హరి అని అంటారు. కానీ ఓ ప్రభుత్వ వైద్యుడు తన కింది స్థాయిలో పనిచేసే మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినప్పటికీ చూసి చూడనట్టు వదిలేయడంతో ఆ పిచ్చి కాస్త ముదిరి "ఆరోగ్యశాఖలో మిస్టర్ అనారోగ్యం"గా మారాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి సంవత్సరం క్రితం ఇక్కడ బదిలీపై వచ్చారు. ఆయన చూపుల్లో.. ఆయన మాటల్లో చాలా తేడా ఉంటుంది. మహిళ సిబ్బందిని అనునిత్యం ఏదో రకంగా లైంగికంగా వేధించడం ఆయనకు సర్వసాధారణంగా మారింది. డ్యూటీ సమయంలో కూడా వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకుండా సిబ్బందితో మీటింగ్ పేరుతో గంటల తరబడి కాలయాపన చేయడం ఈయన నైజం. ఇటీవల పీహెచ్ సికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పలు సందర్భాల్లో వైద్యం కోసం రాగా ఈ మిస్టర్ అనారోగ్యం మాటల్లో మునిగిపోయాడు. ఎంత పిలిచినా .. ఎంత రమ్మన్నా రాడు. మీటింగ్ ఉంది రాను అంటూ గంటల తరబడి పేషంట్లను ఎదురుచూయించాడు. ఏం జరుగుతుందో? ఆసుపత్రిలో స్వయాన ఉన్నతాధికారులకె తెలియాలి. సదరు అధికారి చేస్తున్న లైంగిక వేధింపులపై ఇప్పటికే ఓ మహిళా సిబ్బంది సొంతంగా బదిలీ చేసుకొని వెళ్లిపోయింది. మరి కొంతమంది మహిళా సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరి కొంతమంది మహిళా సిబ్బంది ఇతనితో వేగలేక రోజూ చస్తూ బతుకుతున్నారు. చెబితే తమకు సమాజంలో పరువు పోతుందన్న భయంతో వణికి పోతున్నారు. ఈ మిస్టర్ అనారోగ్యం తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నా పై అధికారులు అతనిపై చర్య తీసుకోవడంలో ఎందుకు విఫలం చెందుతున్నారు..? అర్థం కాని పరిస్థితి. గతంలో ఇదే వైద్య కేంద్రంలో పనిచేసిన మరో వైద్యుడు కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడడంతో అతనిని తొలగించారు. ఆయన తర్వాత సరిగ్గా సంవత్సరం క్రితం వచ్చిన సదరు వైద్యుడు కూడా ఇదే పనిగా పెట్టుకున్నాడు. మహిళా సిబ్బంది పట్ల లైంగిక వేధింపులు, అసహ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలతో.. డబుల్ మీనింగ్ డైలాగులతో సిబ్బంది సహనానికి పరీక్షగా నిలిచాడు. ఈ మిస్టర్ అనారోగ్యం ఎవరు,? ఏమిటో శాఖలోని ఉన్నతాధికారులకు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. మరి వారు ఏం చర్య తీసుకుంటారో? వారికే తెలియాలి. తాజాగా వైద్యం కోసం వచ్చిన బాధితులు ఇతనీ నిర్వాకం పట్ల మీడియాను సంప్రదించగా అసలు సదరు మిస్టర్ అనారోగ్యం గురించి ఆ రా తీస్తే అసలు విషయం బయటపడింది.
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా