ప్రభుత్వ ఉద్యోగి కండకావరం.. పిర్యాదు చేయడానికి వస్తె తలనబిరుసు చూపించిన ఉద్యోగి.

జనం న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) కార్యాలయంలో ఓ వ్యక్తిని శిక్షించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి టేబుల్‌ ముందు కోడిలా తల కిందకు వంచి వంగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన కార్యాలయానికి ఓ విషయమై మూడు సార్లు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కారణంగా సదరు ప్రభుత్వ అధికారి శిక్షించినట్లు తెలుస్తోంది. అధికారిని ఉదిత్ పవార్‌గా గుర్తించారు. 

అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని మీర్‌గంజ్‌కు చెందిన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) ఉదిత్ పవార్‌ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మదన్‌పూర్ గ్రామానికి చెందిన పప్పు అనే వ్యక్తి ఇతర గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు నిమిత్తం వచ్చాడు. తమ శ్మశాన వాటికను ముస్లింలు ఆక్రమించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) కార్యాలయానికి వెళ్లాడు. జిల్లా యంత్రాంగం వెంటనే తగిన చర్యలు తీసుకుని, శ్మశాన వాటిక ఏర్పాటుకు సహకరించాలని కోరాడు. ఈ విషయమై బాధితుడు మూడుసార్లు ఎస్‌డీఎం కార్యాలయానికి వచ్చాడని ఆగ్రహించిన ప్రభుత్వ అధికారి ఉదిత్ పవార్‌ సదరు వ్యక్తిని శిక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అదికాస్తా అధికారులకు చేరింది. తనను ఎందుకు శిక్షిస్తున్నారని ప్రశ్నించినందుకు అధికారి తనను దుర్భాషలాడాడు. మూడు సార్లు కార్యాలయానికి వెళ్లినా తనకు న్యాయం జరగలేదని, తనకు న్యాయం జరిగేంత వరకూ కార్యాలయంలోనే బైఠాయిస్తానన్నాడు. తమ శ్మశాన వాటికను ముస్లింలు ఆక్రమిస్తున్నారని మరికొందరు గ్రామస్థులతో కలిసి ఎస్‌డీఎమ్‌ కార్యాలయానికి వెళ్లగా అధికారి తనను శిక్షించినట్లు బాధితుడు మీడియాకు తెలిపాడు. తన అభ్యర్ధన పత్రాన్ని, దరఖాస్తును కూడా విసిరివేసినట్లు తెలిపాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఉదిత్ పవార్‌ ఖండించాడు. తన కార్యాలయానికి వెళ్లేటప్పటికే పప్పు (బాధితుడు) ఈ విధంగా కూర్చుని ఉన్నాడని పేర్కొన్నాడు. తాను ఆ వ్యక్తిని లేచి నిలబడమని కోరానని, అక్కడున్న ఇతర వ్యక్తులతో కూడా అతన్ని నిలబడమని చెప్పించినట్లు ఉదిత్ పవార్‌ తెలిపాడు. ఈ వ్యవహారంలో జిల్లా మేజిస్ట్రేట్‌ సీరియస్‌ అయ్యారు. ఉదిత్ పవార్‌ చెప్పిన కారణాలను మేజిస్ట్రేట్‌ తోసిపుచ్చారు. బాధిత వ్యక్తి పట్ల అధికారి ప్రవర్తనను తప్పుబట్టారు. దీంతో అతని ఉద్యోగాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.