భార్యను బావిలో వేలాడదీసి వీడియో తీస్తూ ఆపై. చీ..చీ.. వీడు శాడిస్ట్ కాదు అంతకుమించి.

జనం న్యూస్: కట్నం కోసం ఓ నీచుడు కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను బావిలో వేలాడదీసి నరకం చూపించాడు. అంతటితో ఆగకుండా కాపాడండంటూ ఆమె చేసిన ఆర్తనాదాలను వీడియో తీసి ఆమె పుట్టింటి వారికి ఫోన్‌ ద్వారా షేర్‌ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి బుద్ది చెప్పారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లోని జాదవ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కిర్‌ఖెడా గ్రామానికి చెందిన రాకేష్ కిర్ అనే వ్యక్తికి రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఉష అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి రాకేష్‌ భార్యను నానా విధాలుగా హింసించేవాడు. వరకట్నం కింద రూ.5 లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలంటూ వేధించేవాడు. అన్నింటినీ సహిస్తూ వచ్చిన ఉషను ఈ మధ్య కాలంలో మరింత దారుణంగా హింసించ సాగాడు రాకేష్. ఈ నేపథ్యంలో రాకేష్‌ తన భార్య ఉషకు తాడు కట్టి బావిలోకి వేలాడదీశాడు. బావి నీళ్లలో మునిగిన ఆమె భయంతో కాపాడండంటూ ఆర్తనాదాలు చేసింది. బయటకు తీసుకురమ్మని వేడుకుంది. అయితే భర్త ఆమె ఆవేదనను కనీసం పట్టించుకోకుండా పైశాచిక ఆనందం పొందసాగాడు. పైగా భార్య భయంతో వేస్తున్న కేకలను వీడియో తీయసాగాడు. ఈ దారుణాన్ని చూసిన ఇరుగుపొరుగు జోక్యం చేసుకుని ఆమెను రక్షించి బయటకు తీశారు. అనంతరం రాకేష్‌ తాను తీసిన వీడియోను భార్య పుట్టింటివారికి, బంధువులకు ఫోన్‌లో పంపాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి తమ కుమార్తెలను రక్షించవల్సిందిగా వేడుకున్నారు. దీనిపై గృహ హింస కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన ఆగస్టు 20వ తేదీన చోటు చేసుకుంది. జాదవ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అస్లం పఠాన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిందితుడు రాకేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశాం. భార్య పుట్టింటి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు కట్నం తీసుకురావాలని భార్య ఉషను వేధించాడు. రాకేష్‌ను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం నిందితుడు జైలులో ఉన్నట్లు తెలిపాడు.