హైదరాబాద్‌: బాసర.ఇంటిగ్రేటెడ్.బీటెక్.సీట్లభర్తీతీ.

హైదరాబాద్‌: బాసర.ఇంటిగ్రేటెడ్.బీటెక్.సీట్లభర్తీతీ.

జనం న్యూస్ 25 మే 2023 :--- ఆర్‌జీయూకేటీలో మొత్తం 1650 ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (ఇంటర్‌+బీటెక్‌) సీట్ల భర్తీకి జూన్‌ 1న నోటిఫికేషన్‌ జారీ కానుంది. అదే నెల 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వర్సిటీ ఉపకులపతి వి.వెంకటరమణ బుధవారం ప్రవేశాల ప్రక్రియ కాలపట్టికను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వర్సిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేస్తామన్నారు. ప్రవేశాల ప్రక్రియ విధానంలో కొన్ని మార్పులు చేయటంతో నోటిఫికేషన్‌ జారీ ఆలస్యమైందని చెప్పారు. జూన్‌ 20వ తేదీని ఓపెన్‌ డేగా పాటిస్తున్నామని, ఆరోజు ఆయా పాఠశాలల విద్యార్థులు వచ్చి వర్సిటీలోని ల్యాబ్‌లను, తరగతి గదులను సందర్శించవచ్చన్నారు. ఇప్పుడు ఉన్న మెస్‌ కాంట్రాక్టర్లను మార్చాలని గత ఏడాది కాలంలో రెండుసార్లు టెండర్లు పిలిచినా ఇప్పుడున్న ఒకరిద్దరు గుత్తేదార్లే వచ్చారని, కొత్త వారు రాలేదని వీసీ చెప్పారు. మొత్తం 9 వేల మందికి భోజనం వండేందుకు అధునాతన వంటశాల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు.

ముఖ్యాంశాలు 

* మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు.* ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబరు31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయసు 21 సంవత్సరాలు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.* దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450, ఇతరులకు రూ.500* ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోర్‌ కలుపుతారు.* ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్‌ సమానంగా ఉంటే ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్‌, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు ఇస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ ర్యాండమ్‌ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ఇదీ ప్రవేశాల కాలపట్టిక 

* జూన్‌ 1: నోటిఫికేషన్‌ జారీ

* జూన్‌ 5-19: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

* జూన్‌ 24: ప్రత్యేక కేటగిరీ (పీహెచ్‌/క్యాప్‌/ఎన్‌సీసీ/క్రీడాకారులు) వారు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింటౌట్‌ను సమర్పించేందుకు తుది గడువు

* జూన్‌ 26: ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి

* జులై 1: తొలి విడత కౌన్సెలింగ్‌ (ధ్రువపత్రాల పరిశీలన)

జనం న్యూస్ రిపోర్టర్ గట్టు మండలం