
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనం పొందలేకపోతున్న రైతులకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నప్పటికీ కొందరు రైతులు వెబ్‌ల్యాండ్ రికార్డులలో తప్పిదాల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని పొందలేకపోతున్నారు. అన్ని వివరాలు సక్రమంగానే ఉన్నప్పటికీ... ఆధార్ సీడింగ్‌లో తప్పిదాలు చోటుచేసుకోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే వెబ్‌ల్యాండ్‌లో గతంలో పట్టాదారుల పేర్లతో తప్పుగా నమోదైన ఆధార్ నంబర్లను సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం... వెబ్‌ల్యాండ్ పరిధిలోని రికార్డుల్లో 5.44 లక్షల మంది రైతుల భూముల రికార్డులతో ఆధార్ డేటా సరిగ్గా లేదు. దీంతో వీరంతా తొలివిడతలో అన్నదాత పథకం కింద ఆర్థిక సాయాన్ని పొందలేకపోయారు. ఈ క్రమంలోనే వారికి భారీ ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు ఆధార్ సీడింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఆధార్ సీడింగ్ కోసం చెల్లించాల్సిన ఫీజు రూ. 50ని మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఇన్‌చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫీజు మినహాయింపు వల్ల ప్రభుత్వంపై 2.72 కోట్ల భారం పడనుంది. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ సీడింగ్‌లో తప్పిదాలు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
అన్నదాత సుఖీభవ గురించి... ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా ఏడాదికి రూ. 20 వేలను రైతుల ఖాతాల్లో చేస్తున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ. 6 వేలు కాగా, రాష్ట్రం వాటా రూ. 14 వేలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం... ఏడాదికి రూ. 6 వేలను మూడు విడతలలో రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాకు జమ చేస్తుంది. ఇక, అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి ఏడాది తొలి విడతలో రూ. 7 వేలు, రెండో విడతలో రూ. 7 వేలు, చివరి విడతలో రూ. 6 వేలు ఏపీ రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. పీఎం కిసాన్ నిధుల విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదల సమయంలోనే... అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను సైతం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో అర్హులైన రైతుల ఖాతాలో రూ. 7 వేల చొప్పున డబ్బులు జమయ్యాయి. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల కోసం ఏపీ రైతులు ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదల సమయంలోనే... అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి.