Logo

‘మొంథా’ ప్రభావం తగ్గినా భద్రతా చర్యలు కొనసాగించమన్న అధికారులు

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మొంథా తీవ్ర తుపాను తీరం దాటిన సంగతి తెలిసిందే. తుపాను తీరం దాటడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు చేసింది. తుపాన్ తీరం దాటినప్పటికీ పూర్తిగా పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రజలు వేడిచేసిన/ క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) సూచించింది. అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దని... షెల్టర్/ఆశ్రయంలో ఉన్నవారు అధికారులు చెప్పేవరకు తిరిగి ఇళ్లకు వెళ్ళవద్దని తెలిపింది. విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు/తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువులకు దూరంగా ఉండాలని సూచించింది. దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దని కోరింది. దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చే తనిఖీ చేయించాలని సూచించింది. ఇక, మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11.30 నుంచి 12.30 మధ్యలో ‘మొంథా’ తీరం దాటే ప్రక్రియ పూర్తయింది. అయితే ఆ తర్వాత తుపాన్ క్రమంగా బలహీనపడుతుంది. తీరం దాటిన కొన్ని గంటల్లోనే మొంథా తీవ్ర తుపాన్‌ కాస్తా తుపానుగా బలహీనపడగా... రానున్న కొద్ది గంటల్లోనే వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే తుపాన్ ప్రభావంతో ఏపీలో తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే భారీగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో భారీగా పంట నష్టం చోటుచేసుకుంది. అలాగే వర్షంతో పలుచోట్లు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. పలుచోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. కొన్ని చోట్ల విద్యుత్ తీగలపై వృక్షాలు, హోర్డింగ్‌లు పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వివిధ విభాగాల సిబ్బంది సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్దరణ పనులు చేపడుతున్నాయి. అయినప్పటికీ పలు ప్రాంతాలు రాత్రంతా అంధకారంలోనే ఉండిపోయాయి. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగానే ఉంది. పలు తీరాల్లో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి.మొంథా తీవ్ర తుపాన్ తీరం దాటినప్పటికీ ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతరామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.