 
    
జనం న్యూస్:తాగి వాహనం నడిపివారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరులు సైతం ప్రాణాలు కోల్పోయేలా ఘటనలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు అన్నారు. కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘటననే ఉదాహరణగా చూపించారు హైదరాబాద్ పోలీసులు. శివశంకర్ అనే యువకుడు తాగి వాహనం నడిపి డివైడర్‌ను ఢీ కొట్టి తాను చనిపోవడమే కాకుండా మరో 19 మంది మరణానికి కారణమయ్యాడు. శివశంకర్ నడిపిన బైక్ రోడ్డు మీదే పడి ఉండటం ఆ తర్వాత అదే రూట్లో వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్‌ను ఢీకొనటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అసలు శివశంకర్ అనే యువకుడు మద్యం సేవించకుండా ఉండి ఉంటే 19 మంది ప్రాణాలు పోయేవి కావని పోలీసులు చెప్పారు. ఆ యువకుడు మద్యం సేవించి బండి నడపడం వల్లే 19 మంది ప్రాణాలు పోయాయన్నారు. కర్నూల్ ఘటన తర్వాత హైదరాబాదులోనూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. తాగి వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యే వారిని ఉగ్రవాదులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభివర్ణించారు. తమ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు సైతం తీస్తున్న వారిని ఉగ్రవాదులుగా చూడటమే కరెక్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూల్ ఘటన తర్వాత హైదరాబాదులో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు.