Logo

వ్యాయామం చేస్తూ యువకుడు కంటి చూపు కోల్పోయాడు – కారణం వింటే షాక్ అవుతారు!

జనం న్యూస్:జిమ్‌ చేస్తూ 27ఏళ్ల యువకుడు కంటి చూపు కోల్పోయాడు..ఈ విషయాన్ని ప్రముఖ డాక్టర్‌ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టా వేదికగా ప్రజలకు షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా జిమ్‌కి వెళ్లే వాళ్లందరికీ కీలక సూచనలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదో హెచ్చరిక అనుకోవాలి. ఎందుకంటే.. నిన్నమొన్నటి వరకు జిమ్‌లో హార్ట్‌ ఎటాక్‌ మరణాలు చూశాం.. ఇప్పుడు కంటి చూపు పోవడం కలకలం రేపుతోంది.. ఇంతకీ అసలు విషయం ఏంటి..? డాక్టర్‌ చెప్పిన సలహాలేంటో  జిమ్‌లో వ్యాయామం చేయడం శరీరానికి మేలు చేస్తుంది. కానీ కొన్నిసార్లు ఒక చిన్న పొరపాటు తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఇటీవల 27 ఏళ్ల వ్యక్తికి ఎదురైన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. డెడ్‌లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు అతను అకస్మాత్తుగా ఒక కంటి చూపును కోల్పోయాడు. ఈ సంఘటన వైద్యులను కూడా కలవరపెట్టింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా డాక్టర్ ఆశిష్ మార్కాన్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ మేరకు వివరాలు పరిశీలించగా… బాధిత యువకుడు జిమ్‌లో డెడ్‌లిఫ్టింగ్ చేస్తున్నాడు. అది బరువు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అతను తన శక్తినంతా ఉపయోగించి శ్వాసను బిగబట్టి ఒత్తిడికి గురయ్యాడు. కొన్ని సెకన్లలో అతను ఒక కంటిలో దృష్టి కోల్పోయాడని గ్రహించాడు. ఆస్పత్రికి వెళ్లి టెస్ట్‌ చేయించుకోగా అతనికి వల్సాల్వా రెటినోపతి అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు.

వల్సాల్వా రెటినోపతి అంటే ఏమిటి?: ఇది కంటి సంబంధిత వ్యాధి. దీనిలో ఒత్తిడి అకస్మాత్తుగా పెరగడం వల్ల రెటీనాలోని చిన్న రక్త నాళాలు పగిలిపోతాయి. ఒక వ్యక్తి భారీ బరువులు ఎత్తేటప్పుడు లేదా అధిక శక్తిని ప్రయోగించేటప్పుడు వారి శ్వాసను బిగబట్టినప్పుడు ఇది సంభవిస్తుంది. ఫలితంగా, కంటిలో రక్తం పేరుకుపోతుంది. దీనివల్ల దృష్టి సమస్యలు వస్తాయి. చాలా సందర్భాలలో ఈ సమస్య కొన్ని వారాలలోనే దానంతట అదే పరిష్కారమవుతుంది. కానీ, చికిత్స చేయకపోతే ఇది తీవ్రంగా మారుతుంది.

భారీ బరువులు ఎత్తడం వల్ల కళ్ళపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?: మనం డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్‌లు లేదా ఇతర భారీ వ్యాయామాలు చేసినప్పుడు శరీరం లోపల ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ ఒత్తిడి కళ్ళలోని సున్నితమైన రక్త నాళాలను చేరుతుంది. ఎక్కువ లేదా తప్పుగా ఇలాంటి ఎక్సర్‌సైజులు చేయటం వల్ల అది కంటిలో రక్తస్రావం కలిగిస్తుంది . అందుకే జిమ్‌కు వెళ్లేవారు కూడా ఇలాంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాసను బిగబట్టరాదు..ఎందుకుంటే.. చాలా మంది వ్యక్తులు వెన్నెముకను స్థిరీకరించడానికి, లాన్ని పెంచుకోవడానికి వ్యాయామాల సమయంలో శ్వాసను బిగబట్టి చేస్తుంటారు. దీనిని వల్సాల్వా యుక్తి అంటారు. ఈ టెక్నిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే ఇది శరీరంలో ఒత్తిడిని కూడా వేగంగా పెంచుతుంది. ఇది కళ్ళకు హాని కలిగిస్తుంది.