జనం న్యూస్ : ఈగల్ ప్రధాన కార్యాలయంలో ‘2026-2029 మాదక ద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్’ అమలుపై హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు(శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఈగల్ టీమ్స్‌తో జూమ్ కాల్ ద్వారా సమీక్షించారు. గంజాయి నిర్మూలనలో పురోగతి, భవిష్యత్ కార్యాచరణను అనితకు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. భావితరాల బంగారు భవిష్యత్తు కోసమే సీఎం చంద్రబాబు ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఇచ్చేందుకు ‘బ్రేక్ ద సైలెన్స్’ పేరిట 1972 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏపీవ్యాప్తంగా 900 గంజాయి హాట్స్పాట్లను జియో ట్యాగింగ్ నిఘాతో గత 4 నెలల్లోనే 20 వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు హోం మంత్రి వెల్లడించారు. ఈగల్ టీమ్ పటిష్ఠ నిఘాతోనే రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14 శాతం తగ్గిందని అనిత పేర్కొన్నారు.