జనం న్యూస్ :మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా బఫర్ జోన్ మ్యాన్ ఈటర్‌లకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఒకే రోజు గంటల వ్యవధిలో మ్యాన్ ఈటర్ ఇద్దరు‌ వలస కూలీలను బలి తీసుకుంది. వలస కూలీలు, వ్యవసాయ కూలీలు, పత్తి రైతులు, పశువుల కాపారులు ఇలా ఒకటికాదు రెండు కాదు ఏడాది కాలంలో ఏకంగా 33 మందిని బలి తీసుకుంది. ఐదేళ్ల కాలంలో ఈ సంఖ్య సెంచరీ దాటింది. పులి దాడి ఘటనలు పెరగడంతో ప్రత్యేక రెస్కూ టీం ను రంగంలోకి దింపింది మహరాష్ట్ర అటవిశాఖ. తాజాగా మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తడోబా బఫర్ జోన్ పరిధిలో ఇద్దరు వలస కూలీలను రక్తం రుచి మరిగిన బెబ్బులి పొట్టన పెట్టుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ ప్రాంతం నుంచి వెదురు సేకరించేందుకు వచ్చి తడోబా బఫర్ జోన్‌లోని మామలా బీట్, మహద్వాడి బీట్‌లలో 40 మందికి పైగా గుడారులు వేసుకుని పని చేస్తున్నారు వలస కూలీలు.ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మామలా బీ‌ట్‌లో పనిచేస్తున్న ప్రేమ్ సింగ్ ఉదే(55)పై బెబ్బులి దాడిచేసి హతమార్చింది. మిగిలిన వలస కూలీలు కేకలు వేయడంతో పులి అభయారణ్యం లోకి పారిపోయింది. రంగంలోకి దిగిన అటవీ అధికారులు మృతదేహానికి పంచనామా చేస్తుండగానే ఘటనాస్థలానికి కిలోమీటరు దూరంలో మహద్వాడీ బీట్‌లో మరో కూలీపై పులి దాడి చేసిందన్న సమాచారం రావడం అటవిశాఖ అలర్ట్ అయింది. మహద్వాడీ బీట్‌లో వెదురు కలప సేకరిస్తున్న బుదా సింగ్ మడావి(41)ని బెబ్బులి పొట్టన పెట్టుకుంది. కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే రెండు వేర్వేరు దాడుల్లో ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన కూలీల్లో ఆందోళన నెలకొంది.ఇదే బీట్ పరిధిలో ఏడాది కాలంలో పదికి పైగా మరణాలు సంభవించగా… ఈ ఏడాది చంద్రపూర్ జిల్లాలో వన్యప్రాణుల దాడుల వల్ల మరణించిన వారి సంఖ్య 47కి చేరుకుంది. అందులో 33 మంది పులి దాడిలోనే మరణించడం గమనార్హం. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలంలో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి, దాడులకు పాల్పడిన పులిని గుర్తించే పనిలో పడ్డారు. గత ఐదేళ్ల కాలంలో మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో మానవులకు, పులులకు మధ్య పెరుగుతున్న సంఘర్షణపై ఆందోళనల తీవ్రతరంగా మారింది. గత దశాబ్దంలో 70 మ్యాన్ ఈటర్ పులులను మహారాష్ట్ర అటవీశాఖ బంధించగా.. వాటి సంతతి మరో వందకుపైగా ఇంకా అడవుల్లో సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిలో 35 మగ పులులు 27 ఆడ పులులు ఉన్నట్టు సమాచారం. 2025లో ఇప్పటివరకు 33 మరణాలు సంభవించగా, వాటిలోని 30 పులుల వల్ల జరిగాయని అటవీశాఖ గుర్తించింది‌.