జనం న్యూస్ : ఎగ్జామ్‌ రాసేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై లారీ చక్రాల కింద పడి అక్కడిక్కడే ఓ యువతి ప్రాణాలు కోల్పోయిప ఘటన హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బందెల నర్సింహ అనే వ్యక్తికి హంసలేఖ అనే కుమార్తె ఉంది. ఆమె ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌ మెట్‌లోని బ్రిలియంట్‌ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్‌ ఫైనల్ ఇయర్ చదువుతోంది.అయితే మంగళవారం ఎగ్జామ్ నేపథ్యంలో బాటసింగారం‌లోని అన్నమాచార్య కాలేజ్‌ సెంటర్‌లో పరీక్ష రాసేందుకు ఆమె తన స్నేహితుడితో కలిసి బైక్‌పై బయల్దేరింది. అయితే వారు సింగరేణి కాలనీలో లారీని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించగా.. అదే సమయంలో అటుగా వస్తున్న మరో బైక్‌ హంసలేఖ, ఆమె స్నేహితుడు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న హంసలేఖ ఎగిరి కిందపడిపోయింది. దీంతో లారీ ఆమె శరీరంపై నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హంసలేఖ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.  మరోవైపు ప్రమాద సమయంలో బైక్‌ నడుపుతున్న హంసలేఖ స్నేహితుడితో పాటు వాళ్ల బైక్‌ను ఢీకొట్టి వాహనంపై ఉన్న దీప్తి, సాయిగణేశ్, భానుప్రకాష్‌ల అనే విద్యార్థులు కూడా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.