జనం న్యూస్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇప్పటికే.. సుధీర్ఘకాలంగా యుద్ధం జరగుతుండగా.. తాజాగా.. ఉక్రెయిన్.. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. రష్యాలోని నోవ్‌గొరొడ్ ప్రాంత గ్రామంలో ఉన్న పుతిన్ ఇంటిపై ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా పేర్కొంది.. మొత్తం 91 డ్రోన్లను ఆ దేశం ప్రయోగించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తెలిపారు. అయితే అన్నింటినీ నిర్వీర్యం చేశామని, ఇంటికి ఎటువంటి నష్టం కలగలేదని వెల్లడించారు. అయితే.. ఉక్రెయిన్‌పై సరైన సమయంలో దాడిచేసే హక్కు తమకు ఉందని స్పష్టంచేశారు. శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి ఇదని.. తాము చూస్తూ ఊరుకోమంటూ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే వార్తలు ఆందోళన కలిగించాయని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని, దౌత్యంపై తిరిగి దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఘర్షణలకు ముగింపు పలకడం, శాంతి సాధనకు ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నం.. అత్యంత ఆచరణీయ మార్గమన్న ప్రధాని మోదీ.. అన్ని భాగస్వామ్య పక్షాలు వీటిపైనే దృష్టి పెట్టాలని, విఘాతం కలిగించే చర్యలకు అన్ని వర్గాలు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. కాగా.. పుతిన్ ఇంటిపై దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు.. ఉక్రెయిన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. దీని గురించి పుతిన్ తనకు వెల్లడించారని తెలిపారు. ఉక్రెయిన్ చర్య తనకు ఆగ్రహం తెప్పించిందతీ.. దాడి చేయడం సరికాదంటూ వ్యాఖ్యానించారు.


