జనం న్యూస్ :బెంగళూరులో కొత్త పెళ్లైన జంట వేర్వేరే చోట్ల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారి తీసింది. హనీమూన్ ట్రిప్ సందర్భంగా భర్తతో గొడవపడి నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూశాయి. గురువారం (డిసెంబర్ 25) వధువు ఆత్మహత్య తర్వాత ఆమె భర్త కూడా ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్నాడు. నాగ్‌పూర్‌లో అతని తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అసలేం జరిగిందంటే..బెంగళూరులో రెండు నెలల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిగా ఉన్న సూరజ్ అనే వ్యక్తితో గణవి (26) అనే యువతితో వివాహం జరిగింది. అక్టోబర్ 29న గ్రాండ్ వివాహ రిసెప్షన్ కూడా జరిగింది. ఇందుకు వధువు తల్లిదండ్రులు దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత ఈ జంట 10 రోజుల క్రితం హనీమూన్‌కి శ్రీలంకకు వెళ్లారు. ఐతే అక్కడ ఈ జంట గొడవ పడటంతో ఐదు రోజుల్లోనే బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఏం జరిగింతో తెలియదుగానీ నవ వధువు బుధవారం మధ్యాహ్నం అత్తింట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. గణవి సూసైడ్ తర్వాత ఆమె తల్లిదండ్రులు, బంధువులు అత్తింటి వారిపై వరకట్నం వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నేరాల కింద కేసు పెట్టారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె భర్త కుటుంబం వేధింపుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కేసు నమోదైన తర్వాత మృతురాలి భర్త, అతని తల్లి జయంతి, సోదరుడితో కలిసి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు పారిపోయాడు. భార్య మరణించిన 2 రోజుల తర్వాత భర్త సూరజ్ శివన్న (36) శుక్రవారం నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. శివన్న సూసైడ్ చేసుకున్న విషయాన్ని అతడి సోదరుడు సంజయ్ శివన్న నాగ్‌పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంతలో శివన్న తల్లి బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్తితి విషమంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

