
జనం న్యూస్: ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ ఖడ్గం సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఏ రేంజ్‌లో పేలిందో అందరికీ తెలిసింది.. అయితే, ఆ ఒక్క ఛాన్స్ కోసం రవన్న పడ్డ కష్టం మాత్రం అంతా ఇంతా కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలు, సైడ్ హీరో క్యారెక్టర్‌లు చేసుకుంటూ వచ్చిన రవితేజ.. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో కష్టం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే.. రవితేజ, ఎంతో మందికి అవకాశాలు ఇచ్చాడు.. ఇస్తూనే వచ్చాడు. అలా రవితేజ ఇచ్చిన ఛాన్స్ వల్ల ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి పొజీషన్‌లో ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లలో భీమ్స్‌సిసిరోలియో ఒకరు. భీమ్స్‌కు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. నిన్న రాత్రి జరిగిన మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భీమ్స్ సిసిరోలియో తన స్పీచ్‌తో అందరినీ కంటతడి పెట్టించారు. ఆయన మాట్లాడుతూ.. “నిన్ను వదిలీ ఉండలేనూ, నిన్ను విడిచీ వెళ్లలేనూ…” అంటూ పాటతో ప్రారంభించి రవితేజ పట్ల తన మనసులో ఉన్న కృతజ్ఞతను వ్యక్తం చేశారు. “ఒకప్పుడు ఇంటికి అద్దె కట్టలేని పరిస్థితి తను ఎదుర్కున్నట్లు చెప్పాడు. పిల్లల చదువు, భవిష్యత్తు అన్నీ కళ్ళముందు కూలిపోయే పరిస్థితి వచ్చిందని.. చేసేదేమి లేక ఈ జీవితం ముగించాలన్న ఆలోచనలో ఉన్నానని చెప్పాడు. అప్పుడే తనకు రవన్న పిలిచి ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఆయన లేకపోతే నేను, నా కుటుంబం ఈరోజు బతికి ఉండేవాళ్లం కాదు అని భావోద్వేగంగా భీమ్స్ తెలిపాడు.


 
	 
						 
						