సంస్కృతంతో సంస్కారం: మహంత్ స్వామిజీ మిషన్ రాజీపో ప్రేరణ

జాతీయ వార్తలు

జనం న్యూస్: డిజిటల్ యుగంలో మనశ్శాంతి తగ్గిపోతున్న తరుణంలో, BAPS స్వామినారాయణ సంస్థ ప్రారంభించిన ‘మిషన్ రాజీపో’ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం ద్వారా సంస్కారాన్ని నాటుతోంది. మహంత్ స్వామి మహారాజ్ ప్రేరణతో 40 వేల మంది పిల్లలు సంస్కృత శ్లోకాలను కంఠస్థం చేసి, ఆధ్యాత్మికతతో పాటు నైతిక విలువలను అలవర్చుకుంటున్నారు. డిజిటల్ యుగంలో జ్ఞానం పెరుగుతున్నా, మనశ్శాంతి తగ్గిపోతోంది. ఈ తరుణంలో BAPS స్వామినారాయణ సంస్థ చేపట్టిన “మిషన్ రాజీపో” ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్గాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇక్కడ విద్య, ఆధ్యాత్మికత రెండూ కలసి నడుస్తున్నాయి. 2024లో హిస్ హోలినెస్ మహంత్ స్వామి మహారాజ్ ఓ దివ్య సంకల్పం చేశారు. “ప్రపంచవ్యాప్తంగా పిల్లలు సంస్కృత శ్లోకాలను నేర్చుకోవాలి, జపించాలి” అని పిలుపునిచ్చారు. “సంస్కృతమే భాషల తల్లి. దీని ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు” అని ఆయన చెప్పారు. పది వేల మంది పిల్లలు సంస్కృత శ్లోకాలను కంఠస్థం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఆ ప్రేరణ అగ్నివలె వ్యాపించింది. సంవత్సరం తిరగకముందే 40,000 మంది పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. వారిలో 15,666 మంది పిల్లలు 315 శ్లోకాల ‘సత్సంగ దీక్ష’ మొత్తం కంఠస్థం చేసి, పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇంకా వేలాది మంది ఈ యజ్ఞంలో కొనసాగుతున్నారు.

సంస్కృతం వెనుక ఉన్న లోతైన దృష్టి మహంత్ స్వామిజీ ఆలోచన కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రీయమైనదీ. ఆయన అభిప్రాయం ప్రకారం సంస్కృతం ఉచ్చారణను శుద్ధి చేస్తుంది. మనోశక్తిని పదునుపెడుతుంది. చిత్తశుద్ధిని పెంచుతుంది. శ్లోకాల నిత్య పఠనం దృష్టి, ఏకాగ్రత, ప్రశాంతతను పెంపొందిస్తుంది. ఇవన్నీ ఆధునిక విజ్ఞానం కూడా సమర్థిస్తోంది.

సత్సంగ దీక్ష.. జీవన పాఠాల గ్రంథం 315 శ్లోకాలు కేవలం జపించదగిన పదాలు కాదు; అవి జీవన విలువలు. వాటిలోని సారాంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజాయితీ: సత్యాన్ని మాత్రమే పలకడం, న్యాయంగా జీవించడం. నైతికత: ఇతరుల దానిని అన్యాయంగా ఆక్రమించకపోవడం. ఏకాగ్రత: చదువులో మనసు నిలిపి అభ్యాసం చేయడం. కరుణ: ఇతరుల కష్టాలను పంచుకోవడం, సేవ చేయడం. భక్తి: ప్రతి జీవిలో దేవుణ్ణి చూడడం. గౌరవం: తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను సత్కరించడం. సహకారం: సమాజంలో ఐక్యతతో జీవించడం. శాసనం: క్రమశిక్షణతో, నీతి జీవనం గడపడం. ఈ పఠనం ద్వారా పిల్లలు ఇప్పుడు సంస్కృతం నేర్చుకోవడమే కాదు.. సంస్కారాన్ని నేర్చుకుంటున్నారు.

గ్లోబల్ వేదికపై మిషన్ రాజీపో భారతదేశం నుంచి అమెరికా, యూకే, కెనడా, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా వరకు ఈ యజ్ఞం విస్తరించింది. ఈ మహత్తర కార్యక్రమం వెనుక 103 మంది సన్యాసులు, 17,000 వాలంటీర్లు, 25,000 మంది తల్లిదండ్రుల శ్రమ ఉంది. “మిషన్ రాజీపో” నేటి పిల్లలను రేపటి “సంస్కృతి దీపధారులుగా” తీర్చిదిద్దుతోంది. ఆధునికతకు ఆధ్యాత్మికతను, విద్యకు విలువలను జోడించి భవిష్యత్తును కాంతిమయం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *