జనం న్యూస్ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు పేటలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పట్టణంలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ అనే వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఇంటి తాళాలు బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం, లక్ష రూపాయలు నగదు దోచేశారు. ఓ ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వచ్చిన మనోజ్‌ తన ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి తంగుడు మనోజ్ ఆదివారం మధ్యాహ్నం సోంపేటలోని ఓ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చారు. తర్వాత భార్యతో కలిసి ఒరిస్సా లోని బరంపురంలో ఉన్న మరో ఫంక్షన్ కి హాజరయ్యారు. రాత్రికి తిరిగి సోంపేట లోని తన ఇంటికి తిరిగి వస్తుండగా ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారి వద్ద బైక్ పై ఎదురుగా అతి వేగంగా వచ్చిన మరో వ్యక్తి మనోజ్ బైక్ ను డీ కొట్టాడు. దాంతో గాయపడిన మనోజ్ ఇంటికి వెళ్ళాక పరాకుగా మాట్లాడటం, మతి స్థిమితం లేనివాడిలా ప్రవర్తించడంతో అతని స్నేహితుడు ఒక RMP డాక్టర్ తీసుకువచ్చి రాత్రికి ట్రీట్ మెంట్ చేయించారు. ఈ విషయం తెలిసి.. పొరుగువీధిలో ఉండే మనోజ్ అన్నయ్య శ్రీను హుటాహుటిని తమ్ముడు ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే మనోజ్ భార్య,పిల్లలు ఆందోళన చెందుతూ కనిపించటంతో వారందరినీ తన ఇంటికి తీసుకుపోయాడు. నిద్రలో మనోజ్ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో మరునాడు ఉదయం మనోజ్ తన భార్య,పిల్లలతో తన ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన మనోజ్‌ కుటుంబ సభ్యులకు.. గేటుకు వేసిన తాళం కాకుండా మరో తాళం కనిపించింది. దీంతో ఏంటా అని వారు తాళం పగలగొట్టి చూడగా.. బీరువాలోని బంగారం,నగదు మాయం అయినట్టు గుర్తించారు. సుమారు 30 తులాల బంగారం అభరణాలు,లక్ష రూపాయిలు నగదు పోవడంతో లబోదిబోమన్నారు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ తర్వాత బీరువా తాళాలు ఎక్కడ తీశారో .. అక్కడే పెట్టి వెళ్లారు దొంగలు. దీంతో.. ఇది తెలిసినవారి పనే అయిందని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. పైగా.. బంగారు ఆభరణాలు పక్కనే వెండి అభరణాలు ఉన్నా.. దొంగలు వాటిని ముట్టుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగతనంపై సోంపేట సీఐ మంగరాజు, ఎస్‌ఐ లవరాజుతో పాటు బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు, కంచిలి ఎస్‌ఐ పారినాయుడులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించే పనిలో పడింది.