జనం న్యూస్: ఇటు సౌత్‌, అటు నార్త్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన విల‌క్ష‌ణ న‌టుల్లో సోనూసూద్ ఒక‌డు. సినిమాల్లో న‌టించ‌ట‌మే కాదండోయ్‌.. సామాజికి సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న ఎప్పుడూ ముందుంటున్నారు. క‌రోనా టైమ్ నుంచి ప‌లువురికి సాయం చేస్తూ వ‌స్తోన్న ఈయ‌న రియ‌ల్ హీరోగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేరుగానే కాకుండా, సోషల్ మీడియాలోనూ త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌పై సోనూసూద్ స్పందిస్తుంటాడు.తాజాగా త‌న ఫౌండేష‌న్ ద్వారా దేశంలోని 500 మంది మ‌హిళ‌ల‌కు రొమ్ము క్యాన‌ర్స్ చికిత్స చేయించాడు సోనూసూద్‌. అంతే కాకుండా మ‌హిళ‌ల‌కు ఈ రొమ్ము క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న పెంచ‌టం ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నాడు. ‘‘500 మంది మహిళలను శస్త్ర చికిత్సలు చేయించటం ద్వారా కాపాడగలిగాం. అందరి కృషి వల్ల‌నే ఇలాంటి ప‌నులు సాధ్య‌మ‌వుతాయి. వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇది ప్రారంభం మాత్ర‌మే. ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో మ‌రింత‌గా అడుగులు వేస్తాను’’ అని చెప్పిన సోనూసూద్ డాక్ట‌ర్స్‌కు కూడా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు. సోనూసూద్ లాక్ డౌన్ టైమ్‌లో ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌ర స‌మ‌స్య‌లు తీర్చ‌ట‌మే కాకుండా.. వారి గ‌మ్య‌స్థానాల‌కు వారిని చేర్చ‌టంలో ఎంత‌గానో కృషి చేసి అంద‌రి మ‌న‌సుల‌ను చూర‌గొన్నాడు. అప్ప‌టి నుంచి ఓ ఫౌండేష‌న్‌ను స్టార్ట్ చేసి త‌న వంతు సాయాన్ని దేశం యావ‌త్తు చేస్తూనే వ‌స్తున్నాడు సోనూసూద్‌. ఇదే స‌మ‌యంలో తాను సినిమాల్లో ఇక విల‌న్ రోల్స్ చేయ‌న‌ని చెప్పిన సంగ‌తి కూడా తెలిసిందే.