జనం న్యూస్ : భారీ హిమపాతానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. వీటిని చూసిన జనాలు నమ్మలేకపోతున్నారు. ఎడారిలో భారీగా మంచు కురుస్తుంది. గడ్డకట్టే చలి, తెల్లటి రంగులో తివాచీలా కప్పబడిన పర్వతాలు. కానీ ఈ దృశ్యం స్విట్జర్లాండ్ కు సంబంధించినవి కాదు, సౌదీ అరేబియాలోని మండుతున్న ఎడారి ప్రాంతాల్లో వాతావరణం. మీరూ షాక్ అవుతున్నారు కాదా..? వైరల్ క్లిప్‌లు, ఫోటోలను చూసిన తర్వాత, ఈ వీడియోలు కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో సృష్టించబడ్డాయా అనే దానిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది డిజిటల్ కృత్రిమ సృష్టి కాదని, ప్రకృతి అద్భుతం అని స్పష్టమవుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, సౌదీ అరేబియాలోని టబుక్, ట్రోజెనా హైలాండ్స్‌లో భారీ హిమపాతం సంభవించింది. “ఎడారిలో మంచును నమ్మడం కష్టం.” అంటూ సోషల్ మీడియా వేదికగా యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కానీ సౌదీ అరేబియా పర్వతాలు తెల్లటి వస్త్రాన్ని ధరించాయన్నది నిజం. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా వాతావరణ శాఖ స్పందించింది. తబుక్‌లోనే కాకుండా, ఖాసిమ్, హైల్, ఉత్తర రియాద్‌లలో కూడా హిమపాతం ఉంటుందని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు గురయ్యే ప్రమాదం ఉన్నందున, నివాసితులు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

