జనం న్యూస్ : ఇంటి భోజనం ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బయట తినడం స్లో పాయిజన్ వంటిదే..ఆరోగ్యానికి హానికరం.. అని మనందరికీ తెలుసు. బయట తయారుచేసే ప్రతి ఒక్క ఆహారంలో పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో శుభ్రతను అసలు ఊహించనే వద్దు. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ అలాంటి వీధి ఆహారానికి అలవాటు పడుతున్నారు. బహుశా దీనికి కారణం మన ముందు ఆహారం తయారు చేయకపోవడమే కావచ్చు. కానీ, అలాంటి బయట ఫుడ్స్ ఎలా తయారు చేస్తే చూస్తే మాత్రం.. ఇక జీవితంలోనే ఆ ఆహారం తినడం మానేస్తాం. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిర్యానీ లవర్స్ ఈ వీడియోను తప్పక చూడాలి. అదేంటంటే..సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా బిర్యానీ ప్రియులు భగ్గుమంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి డ్రెయిన్ కాలువ పక్కనే బిర్యానీ అమ్ముతున్నాడు. అంతేకాదు.. ఆ మురుగు నీటిని తీసుకొని బిర్యానీలో కలుపుతూ దాన్ని వేడి చేస్తున్నాడు. అది గమనించిన మరొక వ్యక్తి అతన్ని హెచ్చరించాడు ఏయ్ బ్రదర్, నువ్వు మురుగు నీళ్లు ఆహారంలో చల్లుతున్నావ్ అని అంటున్నాడు.. ఇదంతా వీడియోలో స్పష్టంగా వినిపిస్తుంది. ఇది చూశాక నిజంగానే బిర్యానీ ముట్టుకోవాలన్న కూడా బెంబేలెత్తిపోతారు.ఈ వీడియోకు స్పందిస్తూ, చాలా మంది బిర్యానీ తినటం మానేయాలని నిర్ణయించుకుంటున్నారు. మరి కొందరు బయట చికెన్ తినడం మానేయాలని కూడా చెబుతున్నారు. ఒక యూజర్ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా బయట ఎవరు తింటారు? అని రాశారు. ఇంకొందరు శుభ్రమైన, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ వీడియోను సోషల్ మీడియాలో AI వీడియోగా కూడా కొందరు అభివర్ణిస్తున్నారు.

