అలా వెళ్లాడు.. ఇలా ఇరుక్కుపోయాడు..! బయటపడేందుకు నానా తంటాలు.. అసలేం జరిగిందంటే? (వీడియో చుడండి)
·క్రైమ్ వార్తలు·RADHA REDDY
జనం న్యూస్ : చోరీ చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి చొరబడిన వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వెనుకవైపు ఏర్పాటు చేసిన గ్రిల్స్‌లో ఇరుక్కుపోయాడు. అటు వెళ్లలేక.. ఇటు బయటకు రాలేక కొంతసేపు అక్కడే చిక్కుకుపోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. సూరత్‌లోని రాజారాంనగర్ సొసైటీలో ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఓ NRIకి చెందిన ఇంట్లోకి ఓ వ్యక్తి చోరీ కోసం ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి వెళ్లిన అనంతరం బయటకు వెళ్లే క్రమంలో వెనుక భాగంలోని గ్రిల్ వద్దకు చేరుకున్న సమయంలో అందులో ఇరుక్కుపోయాడు. అతడు బయటకు రాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అతడిని పట్టుకునే క్రమంలో కొందరు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కపోదర పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎంఆర్ సోలంకి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వీడియో నానా వరచ్చాలోని రాజారామ్‌నగర్ సొసైటీకి సంబంధించినదని, ఘటన సుమారు పది రోజుల క్రితం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఘటన జరిగిన సమయంలో పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఇంటి యజమాని కిషోర్‌భాయ్‌ను పోలీసులు సంప్రదించినట్లు తెలిసింది. నానా వరచ్చాలోని తన ఇల్లు చాలా కాలంగా మూసి ఉందని ఆయన పోలీసులకు వెల్లడించారు. ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని, నగదు లేదా విలువైన వస్తువులు కూడా ఇంట్లో లేవని తెలిపారు. ప్రస్తుతం వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.