ఛీ.. ఎంట్రా ఈ చెండాలం! ఈ వీడియో చూస్తే బయట ఫుడ్ తినాలంటేనే వణికిపోతారు.. (వీడియో చుడండి)
·వైరల్ వార్తలు·Akhilesh Reddy
జనం న్యూస్ |: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సోయా చాప్ తయారీకి సంబంధించినట్లు చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆహార భద్రత, పరిశుభ్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నోయిడాలోని సెక్టార్-27లోని ఓ సోయా చాప్ తయారీ కేంద్రంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైరల్ వీడియోలో షర్ట్ లేకుండా, చెప్పులు లేకుండా ఉన్న ఓ కార్మికుడు నేలపై పరచి ఉంచిన సోయా చాప్ మిశ్రమంపై పడుకుని దొర్లుతున్నట్లు కనిపిస్తోంది. మరికొందరు కార్మికులు అతడిని లాగుతూ, అతడిపై నీళ్లు పోస్తూ కనిపించారు. అదే సమయంలో నేలపై ఉన్న ఆహార పదార్థాల మధ్య కార్మికులు చెప్పులు లేకుండా తిరుగుతున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. మరోవైపు, వెనుక భాగంలో ఓ కార్మికుడు ఎలాంటి స్పష్టమైన పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండా సోయా చాప్ తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార తయారీ కేంద్రాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే దానిపై ప్రశ్నలు లేవనెత్తుతూ, సంబంధిత ఆహార భద్రతా అధికారులను ట్యాగ్ చేసి ఘటనపై దర్యాప్తు చేయాలని, ఇలాంటి తయారీ కేంద్రాల్లో తనిఖీలను కఠినతరం చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే వైరల్ వీడియో నిజంగా నోయిడాలోని సెక్టార్-27కు చెందినదేనా, అందులో కనిపిస్తున్న ఘటన ఎప్పుడు జరిగింది, సంబంధిత తయారీ కేంద్రంపై అధికారులు ఇప్పటికే ఏమైనా చర్యలు తీసుకున్నారా అనే విషయాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ వీడియో నేపథ్యంలో బయట తయారయ్యే ఆహార పదార్థాల పరిశుభ్రతపై సోషల్ మీడియాలో మరోసారి విస్తృత చర్చ జరుగుతోంది.