జనం న్యూస్ | : రాజస్థాన్‌లోని కోటా నగరంలో ఓ మైనర్ బాలిక, ఆమెతో ఉన్న యువకుడు పోలీసులకు చుక్కలు చూపించారు. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, ఇద్దరూ పోలీసు జీపు బానెట్‌పైకి ఎక్కి హంగామా చేశారు. అనంతరం జీపు పైకప్పుపైకి ఎక్కి అక్కడి నుంచి అరుస్తూ నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నాంటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాలిక రాంపురా ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో నాంటా పోలీసుల బృందం అక్కడికి చేరుకుని బాలికతో పాటు ఉన్న యువకుడిని గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో జీపు బానెట్‌పైకి ఎక్కి హంగామా మొదలుపెట్టారు. పోలీసులు జీపులోకి ఎక్కాలని సూచించగా, వారు ఏకంగా జీపు పైకప్పుపైకి ఎక్కి గట్టిగా అరుస్తూ హల్చల్ చేశారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ హైడ్రామాను అక్కడున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్‌గా మారింది. వీడియోలో యువకుడు, బాలిక పోలీసు జీపు పైకప్పుపై నిలబడి ఉండగా, కింద ఉన్న పోలీసులు, స్థానికులు వారిని కిందకు దిగాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతసేపు కొనసాగిన హంగామా అనంతరం పోలీసులు సీరియస్‌గా వ్యవహరించి ఇద్దరినీ జీపు పైకప్పు నుంచి కిందకు దించారు. అనంతరం వారిని నాంటా పోలీసుల ఆధీనంలోకి అప్పగించారు. బాలిక ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది? యువకుడితో ఆమె ఎలా వెళ్లింది? ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.