జనం న్యూస్ : ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డును కుక్క కరిచిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో జరిగిన ఈ సంఘటన రికార్డ్ కావడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముంబైలోని గోరేగావ్‌లో వీధి కుక్క పాఠశాల సెక్యూరిటీ గార్డు మీదికి దూకి భుజాన్ని కరిచింది. కలవరపరిచే ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. గురువారం, డిసెంబర్ 11న ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో జరిగినట్లుగా వైరల్ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ సంఘటన గోరేగావ్‌లోని సిద్ధార్థ్ నగర్‌లోని ఆదర్శ విద్యాలయ పాఠశాలలో ఉదయం 9.40 గంటల ప్రాంతంలో జరిగిందని సమాచారం. కెమెరాలో రికార్డయిన ఈ సంఘటనలో, వీధి కుక్క అకస్మాత్తుగా దూకి పాఠశాల సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అతని భుజాన్ని కరవడం కనిపిస్తుంది. కుక్క కరిచిన సంఘటన తర్వాత మరో సెక్యూరిటీ గార్డు ఆ వీధి కుక్కపై దాడి చేయడం కూడా వీడియోలో కనిపించింది. వైరల్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మున్సిపాల్టీ అధికారులపై మండిపడుతున్నారు. వీధి కుక్కల బెడదపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

