జనం న్యూస్ : భారత్‌కు పెనుముప్పు పొంచి ఉందా? అమెరికా చేసిన పొరపాటు భారతీయులకు శాపంగా మారనుందా? హిమాలయాల్లో నుంచి ఊహించని ప్రమాదం ముంచుకొస్తుందా? అంటే ఇటీవల వెలువడుతున్న వార్తలు అవుననే అంటున్నాయి. హిమాలయాల్లోని నందా దేవి కొండల్లో కూరుకుపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి న్యూక్లియర్ డివైస్ ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. చైనాపై గూఢచర్యం కోసం 1965లో సీఐఏ రహస్యంగా ఓ మిషన్‌ను నిర్వహించింది. దీనిలో భాగంగా ప్లుటోనియం పవర్డ్ జనరేటర్‌ను అమెరికన్, ఇండియన్ పర్వతారోహకులు తీసుకెళ్లారు. అది ప్రమాదవశాత్తూ అక్కడ పడిపోయింది. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందనే ఆందోళన దశాబ్దాల నుంచి వ్యక్తమవుతున్నది. జపాన్‌లోని నాగసాకిపై వేసిన అణు బాంబులో ఉన్న పీయూ-239 ఐసోటోప్, అత్యధిక రేడియోధార్మిక ఇంధనం పీయూ-238 ఈ డివైస్‌లో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే, దీనిని ఇక్కడ పోగొట్టుకున్న విషయాన్ని అంగీకరించడానికి అమెరికా ఇప్పటికీ తిరస్కరిస్తున్నది. ఆ డివైస్‌పై సమాధానం చెప్పాలని భారతీయులు 1970 నుంచి ఇప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ డివైస్ మంచు ప్రవాహంలో కొట్టుకొస్తే, రేడియో ధార్మిక పదార్థం గంగా నదిలో కలిస్తే, కోట్లాది మందికి క్యాన్సర్ ముప్పు తప్పదని హిమాలయాల సమీపంలోని గ్రామస్థులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లుటోనియం అత్యంత విషపూరిత పదార్థం. ఇది నీటిలో కలిస్తే క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదం పొంచి ఉంది.

