జనం న్యూస్ : ముంబైలోని నివాస ప్రాంతంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. మీరా భయాందర్ ప్రాంతంలో స్థానికులపై చిరుత దాడి చేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చిరుత దాడి స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేసింది. చిరుతపులి దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ బృందం దానిని పట్టుకోవడానికి రంగంలోకి దిగింది. మీరా భయాందర్‌లోని బిపి రోడ్‌లోని పారిజాత్ భవనంలోకి చిరుతపులి ప్రవేశించడంతో భయాందోళనలు వ్యాపించాయి. చిరుతపులి శబ్దం విన్న వెంటనే భవనంలో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్ల తలుపులు, కిటికీలను మూసివేసుకుని ఇంట్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత కొంతమంది స్థానికులు ధైర్యంచేసి చిరుతను ఒక గదిలో బంధించారు. సమాచారం ప్రకారం, ఉదయం 8 గంటలకు చిరుతపులి భవనంలోకి ప్రవేశించింది. కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ దాడిలో చిన్నారి సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.స్థానికుల సమాచారంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతపులి హల్చల్ చేసిన పారిజాత్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌కు చేరుకుని గంటల తరబడి శ్రమించిన తరువాత అతికష్టం దాన్ని బంధించారు. దాంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికీ గానీ స్థానికుల్లో చిరుత భయం తగ్గింది.

