బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలు – ఇందిరమ్మ ఇళ్ల యజమానులకు ముఖ్య సమాచారం!

తెలంగాణ

జనం న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అందించే రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెల్లింపుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మార్పులు పరిపాలనా సౌలభ్యం కోసమేనని ఆయన స్పష్టం చేశారు. స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మూడో విడత మొత్తంలో.. జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద లభించే 90 పనిదినాల వేతనం, మరుగుదొడ్ల నిర్మాణం నిధులను అనుసంధానం చేయడం జరిగింది. ఇకపై.. స్లాబ్ పూర్తయ్యాక లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 1,60,000 జమ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం‘ లబ్ధిదారులకు అందించే రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెల్లింపుల ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మొత్తం మంజూరు చేసే మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని, కేవలం విడుదల చేసే షెడ్యూల్‌లో మాత్రమే ఈ మార్పులు చేశామని మంత్రి స్పష్టం చేశారు.

చెల్లింపుల మార్పునకు కారణం.. ఈ చెల్లింపుల షెడ్యూల్‌లో మార్పు చేయడానికి ప్రధాన కారణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడం. ఇళ్ల నిర్మాణంలో భాగంగా 90 పని దినాల వేతనం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను కూడా లబ్ధిదారులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ఈ అదనపు ప్రయోజనం (90 రోజుల పనిదినాల మొత్తం, మరుగుదొడ్డి నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం) లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది.ఈ నిధుల అనుసంధానం కారణంగా పరిపాలనా సౌలభ్యం కోసం చెల్లింపుల షెడ్యూల్‌లో మార్పు అనివార్యమైందని మంత్రి వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నాలుగు విడతలుగా బిల్లులు చెల్లిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా.. బేస్‌మెంట్ (Basement) వరకు నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 1,00,000 విడుదల అవుతుంది. రెండవ విడతలో.. రూఫ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ. 1,00,000 విడుదల అవుతుంది. మూడవ విడతలో భాగంగా.. ప్రస్తుతం స్లాబ్ వేసిన తర్వాత లబ్ధిదారులకు రూ. 2,00,000 చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతున్న నేపథ్యంలో.. స్లాబ్ పూర్తయ్యాక చెల్లించే మొత్తాన్ని రూ. 1,60,000 (ఒక లక్షా అరవై వేలు)గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన రూ. 1,00,000 విడుదల అవుతుంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులు ఈ నూతన చెల్లింపు షెడ్యూల్‌ను గమనించి, ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. ఈ పథకం ద్వారా తెలంగాణలోని నిరుపేదలకు సొంత ఇల్లు, మరుగుదొడ్డి , ఉపాధి రూపంలో మూడు విధాలుగా ప్రయోజనం లభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *