
జనం న్యూస్ : మొంథా…తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీవైపు దూసుకొస్తోంది. తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలూ…బీ అలర్ట్! ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఏపీ వైపునకు మొంథా తుఫాన్ తరుముకొస్తోంది. ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది మొంథా తుఫాన్. కాసేపట్లో తీవ్ర తుఫాన్ మారి.. ఏపీ తీరం వైపు దూసుకురానుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు.. కాకినాడకు 310 కిలోమీటర్లు.. విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. కోస్తా జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. అటు 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాల రికార్డు నమోదైంది. ఇదిలా ఉండగా.. ఏపీలో 17 జిల్లాలకు రెడ్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇవాళ, రేపు 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. అటు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అంటోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమానాల సంఖ్యను కుదించారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు తెలంగాణపై కూడా తుఫాన్ ప్రభావం పడింది. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు వర్షం పడింది. రాబోయే రెండు లేదా మూడు గంటల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.


 
	 
						 
						