
జనం న్యూస్ : మొంథా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కాకినాడ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన సర్వీసు రద్దు కావడంతో.. మాజీ సీఎం జగన్ బెంగళూరులోనే ఉండిపోయారు. ఆయన విజయవాడ ప్రయాణం వాయిదా పడింది. తుఫాన్ బాధితుల కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు, శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుఫాన్ కష్టాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తప్పలేదు. తుఫాన్ కారణంగా.. ముందస్తు జాగ్రత్తగా పలు విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. దీంతో వైఎస్ జగన్ బెంగళూరు నుంచి విజయవాడకు రాలేకపోయారు.. విమాన సర్వీసుల రద్దుతో ఆయన బెంగళూరులోనే ఉండిపోయారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘తుఫాన్ కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్.జగన్ తాడేపల్లి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. తుఫాన్ ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దుచేశారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే ఆయన బుధవారం వస్తారని ప్రకటనలో వెల్లడించింది. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తిచేశారు ముందు జాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు’ అని వైఎస్సార్‌సీపీ తెలిపింది.మొంథా తుఫాన్ కారణంగా విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి మంగళవారం పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులు మంగళవారం పూర్తిగా రద్దయ్యాయి. ఇండిగోకు సంబంధించి ఉదయం 10.45 వరకు నడిచే సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. అయితే, ఢిల్లీ – విజయవాడ మధ్య నడిచే ఇండిగో సర్వీసు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా మంగళవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రద్దులో భాగంగా ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్‌పూర్, హైదరాబాద్, బెంగళూరుకు రాకపోకలు సాగించే సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ రద్దుతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


 
	 
						 
						