
జనం న్యూస్: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటునకు కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పై మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది. మార్కాపురంను కొత్త జిల్లాగా చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్తగా రంప చోడవరం, పలాస, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, అమరావతి జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. నేడు సీఎం చంద్రబాబుతో క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం కానుంది. కొన్ని గ్రామాలు, మండలాల మార్పులపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. వాటిని 32 జిల్లాలుగా చేయాలనుకుంటోందట కూటమి ప్రభుత్వం. ఎన్నికల హామీ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటునకు కూడా సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తోందట. ఏపీలో కొత్త జిల్లాలుగా ఆరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలాసను విడదీస్తూ కొత్త జిల్లా చేయబోతున్నారట. అలాగే మార్కాపురం, మదనపల్లె, గూడూరు, రాజంపేట కొత్త జిల్లాలు అవుతాయని అంటున్నారు. ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పటినుంచో ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. కొన్ని జిల్లాల విస్తీర్ణం ఎక్కువ.. తక్కువ ఉండటంతో పాటు జిల్లా కేంద్రాల దూరం..ఇలా పలు ఇష్యూస్ అన్నింటిని సెట్‌రైట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చే నివేదికను క్యాబినెట్‌లో పెట్టి చర్చించే అవకాశం ఉంది. త్వరలో జనగణన చేపట్టనుండటంతో.. 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులకు అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగానే జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది. అంతలోపే మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలుపుతారని సమాచారం. 2026 జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చే అంశం పరిశీలనలో ఉందట. కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఏపీలో జిల్లాల సంఖ్య 32కి చేరుతుంది. తెలంగాణలో విభజన తర్వాత 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే కేసీఆర్ హయాంలోనే 33 జిల్లాలుగా చేశారు. తెలంగాణ కంటే జనాభా పరంగా, భౌగోళికంగానూ పెద్దదైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2022 దాకా 13 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నా..జిల్లా కేంద్రాలు, సరిహద్దులు, పేర్ల వివాదం నడుస్తోంది. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ ఆరు కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.


 
	 
						 
						