వర్షాల తీవ్రత పెరగడంతో విద్యార్థుల రక్షణకై సెలవు ప్రకటించిన అధికారులు!

తెలంగాణ

జనం న్యూస్ :ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుపాను మంగళవారం రాత్రి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తరువాత బుధవారం ఉదయానికి తుపానుగా.. సాయంత్రంకు వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. మొంథా తుపాను ఏపీలోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనూ ప్రభావం చూపుతుంది. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడుతోంది. మంగళవారం వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేటలో అత్యధికంగా 4.2 సెం.మీ వర్షం కురిసింది. అయితే, ఇవాళ (బుధవారం) తెలంగాణలోని మూడు జిల్లాలపై  తుపాను ఎక్కువ ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పిల్లల్ని బయటకు పంపించొద్దని తల్లిదండ్రులకు అధికార యంత్రాంగం సూచించింది. తుపాను దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *