
జనం న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించడమే కాకుండా వాటిని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నవీన్ యాదవ్ గెలుపు కోసం పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్‌లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రెండు విడతలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి… తనకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోవడం లేదు. ఇప్పటికే పార్టీ పరంగా మంత్రులకు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి… జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో సినీ కార్మికుల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రణాళిక రచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ… తదితర ప్రాంతాలలో సినీ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోనే సినీ కార్మికుల ఓట్లపై పక్కా వ్యూహంతో రేవంత్ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సినీ కార్మికు సంఘాలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికగా సినీ కార్మికులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో ఇవ్వాలంటే… అలా వచ్చే ఆదాయంలో 20 శాతం వాటా కార్మికుల వెల్ఫేర్‌కు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా నగర్‌లో స్థలం చూస్తే… మంచి స్కూల్ ఏర్పాటు చేసి సినీ కార్మికుల పిల్లలకు ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో కమ్మ సంఘాల నాయకుల భేటీ… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం రాత్రి కమ్మ సంఘాల నాయకులు, ప్రతినిధులు కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ భేటీ మర్యాదపూర్వకంగానే సాగిందని… అమీర్ పేట్ మైత్రీ వనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గం నేతలు కోరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ప్రకటించినట్టుగా కూడా వెల్లడించాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గం నాయకులతో ఈ సమావేశం ప్రత్యేకంగా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే… దివంగత మాగంటి కుటుంబం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నియోజకవర్గంలోని కమ్మ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన కమ్మ సామాజికవర్గం నేతలను రంగంలోకి దించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా కమ్మ సామాజికవర్గం తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (కమ్మ సామాజిక వర్గం) కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం కమ్మ ఓటర్ల మద్దతు కూటగట్టేందుకు తెరవెనక ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వర్గం ఓటర్లను తమవైపుకు తిప్పుకోవడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కమ్మ సామాజిక వర్గం నాయకులతో సమావేశమయ్యారు. ఇలా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోకూడదని సీఎం రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.


 
	 
						 
						