
జనం న్యూస్:భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. ఇక టి20 సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. టి20 సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంలో ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఈ సిరీస్‌ను సన్నాహకంగా చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంది. ప్రస్తుతం భారత జట్టు టి20 ఫార్మాట్‌లో దుర్భేధ్యంగా ఉంది. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్ టి20ల్లో అదరగొడుతుంది. ఆస్ట్రేలియాపై కూడా అదే దూకుడు ప్రదర్శించాలనే ఉద్దేశంలో ఉంది. తొలి టి20లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.ఏడాది కాలంగా టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పెద్దగా ఆడింది లేదు. అడపాదడపా ఆడటం తప్ప నిలకడగా పరుగులు చేసింది లేదు. ఐపీఎల్ 2025కు ముందు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగులు చేయడంతో ఫామ్‌లోకి వచ్చాడని అంతా అనుకున్నారు. అయితే ఆసియా కప్‌లో మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గ్రూప్ దశలో ఆడిందే తప్ప.. సూపర్ 4, ఫైనల్లో పెద్దగా పొడిచింది లేదు. ప్రస్తుతం టీమిండియా టి20 జట్టులో చోటు కోసం చాలా పోటీ నెలకొని ఉంది. జైస్వాల్, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, జితేశ్ శర్మ, రింకూ సింగ్ లాంటి ప్లేయర్లు చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా తరఫున గత 5 ఇన్నింగ్స్‌లను చూస్తే.. 47 నాటౌట్, 0, 5, 12, 1గా ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో 69 పరుగులు మాత్రమే చేశాడు.


 
	 
						 
						