
జనం న్యూస్ :పెళ్లికి కొన్ని రోజుల ముందు దుబాయ్ నుంచి పెళ్లికుమారుడు వచ్చాడు. ఇరుకుటుంబాల వారు సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహానికి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 23న అమ్మాయి కుటుంబం జాగరన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా భాంగ్రా డాన్స్ చేసింది. ఎంతో చక్కగా గిద్ద ప్రదర్శించింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులతోనూ డాన్స్ చేయించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. దీంతో ఆమెను వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించిందని వైద్యుడు చెప్పాడు. దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు, గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. వివాహానికి ఒక రోజు ముందు పెళ్లికూతురు మరణించడంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో, చావు డప్పులు మోగాయి. నేటి రోజుల్లో వేడుక ఏదైనా డీజే పాటలు మాత్రం తప్పనిసరి అయ్యాయి. చెవులు చిల్లలు పడేలా శబ్దం గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు డీజేలకు రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఇవ్వడం లేదు. కానీ కొంత మంది అనధికారికంగా అర్ధరాత్రి వరకు వాటిని వినియోగిస్తున్నారు.

