ఎన్నికల నివేదికలను సకాలంలో సమర్పించాలి

ఎన్నికల నివేదికలను సకాలంలో సమర్పించాలి

---పెద్దపల్లి  పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా

--నిష్పక్షపాతంగా ఎన్నికల విధుల నిర్వహణ

--ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

--పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతుల కల్పన

--పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారులతో సమీక్షించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు

జనం న్యూస్ , ఏప్రిల్ -25( సబ్బు సతీష్ ప్రతినిధి )

లోక్ సభ ఎన్నికల నివేదికలను సకాలంలో సమర్పించాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పని చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా అన్నారు. 

గురువారం పెద్దపల్లి పార్లమెంట్ సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ సన్నద్దత పై ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ నైరంతర్యా, పోలీస్ పరిశీలకులు మనీష్ చౌదరి, పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్,మంచిర్యాల జిల్లా కలెక్టర్ బి.సంతోష్, సహాయ అసెంబ్లీ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. 

పార్లమెంట్ సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా మాట్లాడుతూ,  లోక్ సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ విభాగాలు చేసే కార్యక్రమాల నివేదికలను సకాలంలో సమర్పించాలని అన్నారు.  ప్రతి రోజు వార్తా పత్రికలలో ఎన్నికలకు సంబంధించి వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్త వివరాలు, సి విజల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, ఎన్నికల తనిఖీలలో చేస్తున్న జప్తు వివరాలు ఎప్పటికప్పుడు సమర్పించాలని అన్నారు. 

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో తుది ఓటర్ జాబితా రూపొందించి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలని, ఓటర్ స్లిప్పుల పంపిణీ పురోగతికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందజేయాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఓటరుకు ముందస్తుగా ఓటర్ స్లిప్ అందేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు, వాటిలో ఎన్ని పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి అనే అంశంపై ప్రతిరోజూ నివేదిక అందించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ తరలించేందుకు అవసరమైన వాహనాలు సన్నద్ధం చేసుకోవాలని, ముందస్తుగా రూట్ పరిశీలించాలని, పట్టణ ప్రాంతాలలో ఇరుకు సందులలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయా అక్కడికి వాహనం వెళ్లేందుకు వీలు ఉంటుందా ముందుగానే పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. 

పోలింగ్ సమయంలో ఎన్నికల ఏజెంట్లకు సెల్ ఫోన్ అనుమతి ఉండదని, పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లు ఓటర్లతో సంభాషించ డానికి వీలులేదని, దీనిపై పోలింగ్ సిబ్బందికి తగిన సమాచారం ఆదేశాలు జారీచేయాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు.  

పోలింగ్ సమయంలో ఒకే చోట అధికంగా ప్రజలు గుమీగూడకుండా జాగ్రత్త వహించాలని, ఎన్నికల ప్రచార సమయంలో వివిధ రాజకీయ పార్టీల స్టార్ క్యాంపైనర్లు పర్యటించే సమయంలో వీడియో బృందాలతో పాటు అధికారులు తప్పనిసరిగా వెళ్లాలని, ప్రచారంలో ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. 

ఓటరు జాబితా దగ్గరి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ప్రతి అంశంలో ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇప్పటివరకు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 

పెద్దపల్లి పార్లమెంట్ పోలీస్ పరిశీలకులు   మాట్లాడుతూ,  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే దిశగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు. నిష్పక్షపాతంగా  పారదర్శకంగా విధులు నిర్వహించాలని,ఎన్నికల ర్యాలీలకు, సభలకు అనుమతులు ఇచ్చే సమయంలో నిబంధనలు పాటించాలని అన్నారు. 
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ నైరంతర్యా మాట్లాడుతూ,అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు.  స్టాటిక్ సర్వేలెన్సు, ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలన్సు, వీడియో వ్యూయింగ్ , అకౌంటింగ్ బృందాలు వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. 
ఎన్నికల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను పాటించాలని, ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, నగదు, ఆభరణాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు అందించాలని అన్నారు. 
పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి  ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని,  పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం 15 లక్షల 92 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని అన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ రేపటి నుంచి ప్రారంభిస్తామని,  పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్క ఓటర్కు ఓటర్ స్లిప్పు అందేలా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు. 
వేసవిలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పిస్తున్నామని,  ఓటర్ క్యూలైన్ల వద్ద నీడ ఉండే విధంగా టెంట్లు, క్యూలైన్ల వద్ద చల్లని మంచినీరు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.  పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు  సిబ్బందికి  అవసరమైన శిక్షణ అందిస్తున్నామని అన్నారు. 
ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని,  బ్యాంకార్లతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకులలో జరిగే అనుమానాస్పద లావాదేవీల వివరాలు సేకరిస్తున్నామని అన్నారు . 
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మేర ఈవీఎం యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, మొదటి దశ ర్యాండమైజేషన్ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఈవీఎం యంత్రాలను తరలించి స్ట్రాంగ్ రూం లలో భద్ర పర్చామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అవసరమైన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు రిసెప్షన్ కేంద్రాలను సిద్ధం చేయనున్నట్లు అన్నారు. 
పోలింగ్ లో  పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొని పోలింగ్ శాతం పెరిగే దిశగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి విద్యా సంస్థలో ఓటరు లీడర్స్ క్లబ్ లను  ఏర్పాటు చేశామని, ఓటరు అవగాహనపై కళాశాలలో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో డిసిపి మంచిర్యాల, డిసిపి పెద్దపల్లి చేతన, పెద్దపల్లి అదనపు కలెక్టర్లు జే.అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్, జగిత్యాల, మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ లు, రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, హనుమా నాయక్, ఏసిపి లు, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.