చేనేతల్ని ఆదుకున్నది.. ఆదుకునేది టీడీపీ మాత్రమే

చేనేతల్ని ఆదుకున్నది.. ఆదుకునేది టీడీపీ మాత్రమే

ఉచిత విద్యుత్, ముడిసరకుపై సబ్సిడీ ఇస్తాం

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్, వైసీపీలో ఉన్నవారు టీడీపీలోకి వస్తున్నారు

ఇదంతా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల నిర్వాకం వలనే

ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పరిటాల సునీత

పలువురు వైసీపీ సీనియర్ నాయకులు, పార్టీలో చేరిక..

జనం న్యూస్ ఏప్రిల్ 2 జిల్లా ఇన్చార్జ్....చేనేత కార్మికులను గతంలో ఆదుకున్నది.. రేపు ఆదుకోబోయేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అనంతపురం రూరల్ మండల పరిధిలో రెండవ రోజు పర్యటించారు. సిండికేట్ నగర్, రాచానపల్లి, 
ఎస్సీ కాలనీ, దోబీ కాలనీ, బీఎన్ఆర్ కాలనీ, అక్కంపల్లి, ఎన్ఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ధర్మభిక్షం కాలనీ, సదాశివ నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలకు వచ్చిన సునీతకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింలతో కలసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఏవైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలు, సానుభూతి మాటలు మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన ప్రకాష్ రెడ్డి ఏ రోజు ప్రజా సమస్యల పై స్పందించిన దాఖలాలు లేవన్నారు. అందుకే ఇప్పుడు ప్రజలంతా ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా రూరల్ కాలనీల్లో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారని.. వారి ఇబ్బందులు కూడా తమకు తెలుసునన్నారు. గతంలో ముడిసరుకు పై ఉన్న సబ్సిడీని ఎత్తివేశారన్నారు. వారికి జీఎస్టీ రూపంలో అదనపు భారం పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చాక.. మగ్గం ఉన్న చేనేతలకు 2వందల యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్టు చెప్పారు. ముడి సరుకు కొనుగోలుకు రాయితీలతో పాటు రుణాలు మంజూరు చేస్తామన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్ల నిర్మాణం కూడా చేస్తామని వివరించారు. అలాగే దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. మరోవైపు బీజేపీతో పొత్తు కారణంగా ముస్లింలు ఒకింత ఆందోళనలో ఉన్నారని.. వారు ఏమాత్రం అపోహ పెట్టుకోవద్దన్నారు. 2014-19వరకు బీజేపీతో పొత్తులో ఉన్నామని.. కానీ ఏరోజు ముస్లింలకు ఇబ్బందులు కల్గలేదన్నారు. పైగా చంద్రబాబు ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు, మసీదులు, ఈద్గాల మరమ్మతులకు నిధులు కేటాయించారన్నారు. మీకు ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగించాలన్నా .. రాప్తాడులో పరిటాల కుటుంబాన్ని దాటుకుని పోవాలన్నారు. 

టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులు

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల తీరు వలన ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్, వైసీపీలో ఉన్న వారు కూడా టీడీపీలో చేరుతున్నారని సునీత అన్నారు. సిండికేట్ నగర్ కు చెందిన సీనియర్ నాయకులు సాయి కుమార్, చాకలి సూరి, నవీన్, చంద్రమౌళి రెడ్డి (బాబు), కురుబ లక్ష్మీనారాయణ, రంగన్న తదితరులు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి పరిటాల సునీత వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో తాము స్వేచ్ఛగా పనులు చేసుకున్నామని.. కానీ వైసీపీ వచ్చిన తరువాత మా పార్టీ అయినప్పటికీ ఏ పని చేసుకోలేకపోతున్నామన్నారు. సొంత పార్టీ వారే తమను ఇబ్బందులకు గురి చేశారని వారు అన్నారు. మరోవైపు సునీత మాట్లాడుతూ బాలక్రిష్ణ మీద అభిమానంతో ఫోటో వేసుకుంటే కూడా వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఉన్నా.. కొందరు బాలక్రిష్ణను అభిమానిస్తుంటారని..అలాంటి వారిపై కూడా కక్ష కట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే ఎప్పుడూ టీడీపీ జెండా వైపు చూడని వారు కూడా ఇప్పుడు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి వలసలు ఉంటాయన్నారు....