జనం న్యూస్: దీపావళి టపాసుల నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదాన్ని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే రోడ్డుపై భారీ షాట్స్ కాల్చగా, ఓ ఎలక్ట్రిక్ ఆటో తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. షాట్స్ పేలుడు ఆటోకు తగలడంతో ప్రయాణికులు భయంతో దిగిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.. ఆ వీడియో చూస్తే ఇంత తీటగాళ్లు ఏంట్రా బాబు అని అనిపిస్తుంది. దీపావళి సందర్భంగా చాలా మంది టపాసులు కాల్చారు. తప్పులేదు.. కానీ కొంతమంది ఇలా రోడ్లపై ఇతరులను ఇబ్బందులకు గురి చేశారు. అదృష్టం కొద్ది అది ఇబ్బందితో సరిపోయింది. నిజానికి అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దీపావళి సందర్భంగా ఓ యువకుడు భారీ షాట్స్‌ను తీసుకొచ్చి రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఉంచాడు. నిత్యం వాహనాలు ఆ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ షాట్స్ పెట్టిన సమయంలో ఒక ఎలక్ట్రిక్ట్ ఆటో రిక్షా అటువైపుగా వచ్చింది. రోడ్డు మధ్యలో ఉన్న షాట్స్ గమనించని డ్రైవర్ దాని పక్కనుంచి పోనిచ్చాడు. కానీ, ఆ షాట్స్ ఆటోకు తగిలి ఆటోతో పాటే ముందు వెళ్లింది. దాంతో ఆటో వాలా ఆటోను ఆపేశాడు. అప్పటికే షాట్స్‌కు నిప్పు పెట్టడంతో అవి పేలడం ప్రారంభించాయి. దీంతో భయపడి ఆటోలో ఉన్నవాళ్లంతా దిగిపోయారు. డ్రైవర్ కూడా దిగిపోయాడు. కొద్ది సేపు షాట్స్ భారీ ఎత్తున పేలాయి. ఆ పేలుళ్లకు ఆటో కాలిపోతుందేమో అనిపించింది. అదృష్టవశాత్తు అలా జరగలేదు. కానీ, బ్యాటరీతో నడిచే ఆటో అంత భారీ నిప్పు రవ్వులు ఎగిసిపడుతుంటే కాలిపోయే ప్రమాదమే ఎక్కువ. ఓ ఆకతాయి చేసిన పనికి ఓ పేదవాడు తన జీవనోపాధి కోల్పోయేవాడు. ప్రమాదం జరిగి ఉంటే ప్రాణాలు కూడా పోయేవి.