ఏపీ నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్..! పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
·ఆంధ్రప్రదేశ్·Akhilesh Reddy
జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (AP SLPRB) ఆధ్వర్యంలో మొత్తం 2,050 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలైనట్లు సమాచారం. పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక సేవలు, జైళ్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ వంటి విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్, సాంకేతిక, శాస్త్రీయ విభాగాల పోస్టుల వరకు వివిధ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ కేటగిరీలో సివిల్ ఎస్‌ఐ పోస్టులు 253, ఆర్మ్డ్ రిజర్వ్‌లో 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 9, కమ్యూనికేషన్స్ విభాగంలో 50, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10 పోస్టులు ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్, ఇతర అనుబంధ పోస్టుల విషయానికి వస్తే మొత్తం 1,156 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 542, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు 285 ఉన్నాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులు, జైళ్లు, సంస్కరణ సేవల శాఖలో పురుష, మహిళా వార్డర్ పోస్టులు కలిపి 171 పోస్టులు ఉన్నాయి. కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 198 డ్రైవర్, మెకానిక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా నియామక ప్రక్రియలో చేర్చారు. వీటిలో ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయాలజీ, సెరాలజీ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్షల తేదీలు తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొననున్నారు. అభ్యర్థులు దరఖాస్తు తేదీలు, అర్హతలు, పరీక్ష విధానం వంటి వివరాలను అధికారిక AP SLPRB సమాచారంతోనే నిర్ధారించుకోవడం మంచిది.