డి.డి.ఓ. కార్యాలయాలు నవంబర్ 1 నుండి ప్రారంభం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Uncategorized

జనం న్యూస్: అక్టోబర్23 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్) ​రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచాయతీల పాలన సంస్కరణల ఫలాలను ప్రజలకు సక్రమంగా అందించాలని ఆయన ఉద్యోగులను కోరారు. ​పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో గురువారం సమావేశమైన పవన్ కళ్యాణ్, క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా చేయడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చూస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు సమకూరుస్తున్నామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా కొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ​కూటమి ప్రభుత్వం నిధుల విషయంలో, పాలనా సంస్కరణల అమలులో సానుకూలంగా ఉందని, ఈ ఫలితాలను ప్రజలకు చేర్చి పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ‘పల్లె పండగ 2.0’ ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *