ఐదేళ్ల పీడకల నుంచి మేల్కొనే తరుణం!

ఐదేళ్ల పీడకల నుంచి మేల్కొనే తరుణం!

జనం న్యూస్ 12 మార్చి 2024 :  మార్చి 31, 2024 నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 5 బడ్జెట్ల కాలం ముగుస్తున్నది. ఎన్నికల ప్రక్రియ మొదలై ఫలితాలు వెలువడే మరో రెండు నెలల వ్యవధి వరకు మధ్యంతర బడ్జెట్తో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ రెండు నెలలకు కూడా మరో రూ.20వేల కోట్లు అప్పు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది.రాష్ట్ర ప్రజలను మరోసారి తీర్పు కోరుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలోని ఇటువంటి ఘోర వైఫల్యాలను, పాపాలను కప్పిపుచ్చి నవరత్నాలు అమలు చేశామని, ఎన్నికల మేనిఫెస్టోలో 99శాతం హామీలు నెరవేర్చామని బొంకుతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా.. 'మీ ఇంట్లో మంచి జరిగితే ఓట్లు వేయండి' అని ప్రజలను కోరుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కాకిలెక్కల ప్రకారం.. మొత్తం కుటుంబాలలో 45శాతం మందికి ఏదో ఒక రూపంలో నగదు బదిలీ చేశామని, అంచేత వారందరూ తమకే ఓట్లేస్తారని, దాంతో మరోమారు అధికారపీఠం అధిష్టించవచ్చునన్నది వారి దింపుడు కళ్లం ఆశగా.ఉంది.వాస్తవాలను గమనిస్తే.. జగన్ ఇన్నాళ్లు నొక్కింది సంక్షేమ బటన్ కాదు, ప్రజలపై మోయలేని భారం మోపే బటన్ మాత్రమేనని అర్థమవుతుంది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 51 పైసల అప్పు ఉందని ప్రతియేటా రాష్ట్ర బడ్జెట్లను ఆడిట్ చేస్తున్న కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది. ఈ ఐదేళ్లల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం దారుణమైన దుర్మార్గపు పనులెన్నో చేసింది. అన్నింటికంటే ఎక్కువగా ఆర్థిక నిర్వహణలో జగన్ ప్రభుత్వం దుర్మార్గమైన తప్పులు చేసిందని 'కాగ్' ఎండ గట్టింది. యథేచ్చగా సాగిన రాజ్యాంగ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కరణలు, మానవ హక్కుల హననాలు, విచ్చలవిడి అవినీతి, పారదర్శకతకు వేసిన పాతరలు.. వీటన్నింటికి మించి చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని ఘోరాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఒడిగట్టింది. భారత రాజ్యాంగం అధికరణ 266 ప్రకారం బడ్జెట్ అనుమతి లేకుండా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. అలాగే ద్రవ్య వినిమయానికి చట్టసభ ఆమోదం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు వినియోగించకూడదు. కానీ, ఈ రెండు రాజ్యాంగ బాధ్యతల్ని జగన్ సర్కార్ బేఖాతరు చేసిందని 'కాగ్' వెల్లడించింది. బడ్జెట్లో చూపకుండా ఆర్థిక లావాదేవీలు జరపడం మరో నేరం. కార్పొరేషన్ల ద్వారా సేకరించే రుణాలకు సంబంధించిన సమాచారాన్ని తొక్కిపెడుతూ వస్తున్నారు. కేంద్రం అందించే నిధులను నిర్దేశిత రంగాలలో ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు వాడటం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే.ఇక, జగన్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం 5 బడ్జెట్లలో ప్రతిపాదించిన మొత్తం రూ.12,19,048కోట్లు. ఇదే కాలంలో చేసిన మొత్తం అప్పులు రూ.8,10,000 కోట్లు. వెరశి ఈ ప్రభుత్వం ఐదేళ్లల్లో దాదాపు రూ.20లక్షల కోట్లు వ్యయం చేసినట్లు లెక్క. బడ్జెట్ అంచనాలకు అందుకోలేకపోయిన మొత్తాన్ని తీసివేసినప్పటికీ ఏడాదికి సగటున మూడున్నర లక్షల కోట్లు వ్యయం చేసి సాధించిన ఫలితాలేమిటో సమీక్షించాల్సిన అవసరం ఉంది.2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్ఓపీ) సగటు వృద్ధిరేటు 14.99% ఉండగా, 2019-24 మధ్య జీఎస్ఓపీ సగటు వృద్ధిరేటు 10.93%కు పడిపోయింది. అంటే, రెండు ప్రభుత్వాల మధ్య వృద్ధిరేటులో 4% వ్యత్యాసం ఉంది. తెలుగుదేశం సాధించిన వృద్ధిరేటును కనీసం కొనసాగించి ఉంటే రాష్ట్ర ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగి ఉండేది. భారీగా అప్పులు తేవడం వల్ల కోశలోటు అదుపు తప్పింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫెస్ఆర్బీఎం) చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కోశలోటు 3% మించకూడదు. కోవిడ్ అనంతరం రాష్ట్రాలు కొన్ని రంగాలలో పన్నులు అదనంగా విధించాలనే నిబంధనతో కేంద్రం ఎస్ఆర్ఎంబీ పరిమితిని సడలించి 3.5% మేరకు అప్పులు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, దీనిని మించి రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో జీఎల్డీపీలో 3.6% మేర, 2023-24లో 3.8% మేర అప్పులు చేసింది. ఈ అప్పులపై వడ్డీలు చెల్లింపునకే ప్రతియేటా బడ్జెట్లో 14శాతం నిధుల్ని జమ చేస్తున్నారు.కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు సైతం భారీగా అప్పులు చేస్తున్నప్పటికీ.. ఆదాయం అందించే మౌలికరంగ ప్రాజెక్టులపై అత్యధికంగా ఖర్చు చేసి సానుకూల ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ, అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎంతో ఘనంగా చాటింపు వేసుకొంటున్న విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు 12.6% కాగా, దేశంలోని ఇతర రాష్ట్రాల సగటు వ్యయం 14.8%. ఇంధన రంగంలో ఏపీ కేటాయింపులు 2.1% అయితే, మిగతా రాష్ట్రాల సగటు 4.8%. రోడ్లు, భవన నిర్మాణ రంగంలో ఏపీ కేటాయింపులు 2.9% కాగా, ఇతర రాష్ట్రాల సగటు కేటాయింపులు 4.5%. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు ఉపయోగించుకొంటున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థపై చేస్తున్న కేటాయింపులు 2.9% కాగా, జాతీయ సగటు 4.3%గా ఉంది. పట్టణాభివృద్ధిలో కేటాయింపులు 3.1%గా ఉంటే, జాతీయ సగటు 3.5% రాష్ట్రంలో పోలవరంతో సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి. కొన్ని ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పూయడానికి కూడా నిధులు లేక అధికారులు జేబులు తడుముకొంటున్న దారుణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. గుంటలు పడిన రోడ్లకు అతుకులు వేయలేక పోవడం ప్రభుత్వ వైఫల్యమా? నిర్లక్ష్యమా? ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న పనులు చేపట్టేందుకు కూడా కాంట్రాక్టర్లు భయపడిపోతున్నారు. సర్వీస్ ప్రొవైడర్లు ఏ పనికీ ముందుకు రావడం లేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాంట్రాక్టర్లకు, సర్వీసు ప్రొవైడర్లకు చెల్లించవలసిన రూ.95వేల కోట్ల మేర బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ముందుగా పెట్టుబడి పెట్టి పనులు చేశాక, ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో అప్పులపాలైన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకొన్న దురదృష్ట సంఘటనలు ఈ ఐదేళ్లలో అనేకం జరిగాయి. సాధారణంగా కాంట్రాక్టర్లను ప్రభుత్వాలు బ్లాక్ లిస్ట్లో పెడతాయి. కానీ ఇక్కడంతా రివర్స్. కాంట్రాక్టర్లే ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. 'మీకు, మీ ప్రభుత్వానికో దండం' అంటూ చాలా మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు చేయడం మానుకొన్నారు. మౌలికరంగాలలో పనులు మందగించడం వల్ల లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. వారందరూ పొరుగు రాష్ట్రాలకు వలసలు పోయారు.1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2014 వరకు, ఆ తర్వాత ఐదేళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరూ 66 సంవత్సరాలలో చేసిన మొత్తం అప్పు రూ.3,62,375 కోట్లు కాగా, ఈ ఐదేళ్లలో జగన్ మోహన్రెడ్డి ఒక్కడే చేసిన అప్పు రూ.8,00,810కోట్లు. ఎన్నడూ లేని విధంగా ఎందుకు రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టిందని ప్రశ్నించుకొంటే, రాష్ట్ర ఖజానాకు దఖలు పడాల్సిన ఆదాయ వనరులలో సింహభాగం అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దల జేబుల్లోకి పోవడమేనన్న జవాబు లభిస్తుంది. ఉదాహరణకు డిజిటల్ చెల్లింపులు లేకపోవడం వల్ల మద్యం అమ్మకాల ద్వారా లభించే ఆదాయంలో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఇసుక వేలం పాటల ద్వారా, మైనింగ్ కాంట్రాక్టుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. మరోపక్క పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో ఒక్కో ఎకరా రూ.5-10లక్షలు ఖరీదు చేసే భూముల్ని రూ.60-70లక్షల చొప్పున కొన్నారు. ప్రజల సొమ్మును రైట్రయల్గా దోచుకోవడంలో ప్రభుత్వ పెద్దలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మరోపక్క ప్రభుత్వంలో మితిమీరిన దుబారా. ఈ ఐదేళ్లల్లో కేవలం కోర్టు కేసుల వాదనలకి సంబంధించి రూ.5000కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక, సలహాదారులకు, సొంత పత్రిక, ఛానల్లో ప్రకటనలకు, వాలంటీర్ల జీతాలు, వారి గిఫ్ట్లకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా బయటకు తెలిసేవి కొన్ని, తెలియనివి ఎన్నో.ప్రతియేటా పెరుగుతున్న బడ్జెట్ పరిమాణం వెనుకనున్న అసలు గుట్టు ఏమిటంటే.. ప్రజల మీద అధిక భారం మోపి వారి ముక్కుపిండి పన్నులు వసూలు చేయడమే. ఈ ఐదేళ్లల్లో విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, యూజర్ ఛార్జీలు, వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొదలైనవి పెంచడమే కాక చెత్తపన్ను, ఖాళీ స్థలాలపై పన్ను వంటి 24 రకాల పన్నుల బాదుడుతో ఏటా రూ.50,000కోట్ల భారం మోపారు.కొన్ని వర్గాల ప్రజలను ఓటు బ్యాంకులుగా మలుచుకోవడానికి సమాజంలోని ఇతర వర్గాల ప్రయోజనాలను దెబ్బతీయడం స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేదు. ఏ ప్రభుత్వమైనా సమ్మిళిత అభివృద్ధి కోసం పాటుపడటమే లక్ష్యంగా పెట్టుకొంటుంది. కానీ సీఎం జగన్ స్టయిల్ వేరు. పేదలు, పెత్తందార్లు అంటూ సమాజాన్ని విడదీశారు. దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాలను శత్రువులుగా పరిగణిస్తున్నారు. పోనీ పేదలనైనా ఉద్ధరిస్తున్నారా? అంటే అదీ లేదు. పేదరికాన్ని రూపుమాపేందుకు, పేదవర్గాలను సాధికారుల్ని చేసే పథకం ఒక్కటీ ప్రభుత్వం అమలు చేయడం లేదు.ఈ ఐదేళ్ల పాలనలో జగన్ మార్క్ దేనిలో కన్పిస్తోందంటే కరప్షన్లో, క్రిమినల్ పాలిటిక్స్లో, క్రూయాలిటిలో, కోర్టుల కంటెస్ట్లో! సీఎం జగన్కు బాధ్యత లేదు. బాంధవ్యాలు అసలే లేవు. సొంత బాబాయి హత్య కేసులో ముద్దాయిని రక్షించటానికి ప్రయత్నించడం, సొంత చెల్లెలిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తుంటే నిర్వికారంగా తనకేమీ పట్టనట్లు జగన్ చిరునవ్వులు చిందించడం చూసే వారికి ఆశ్చర్యం కలుగుతుంది. జగన్కు చట్టాల పట్ల గౌరవం లేదు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. రాష్ట్ర ప్రజానికి ఈ ఐదేళ్ల పాలన ఓ పీడకల! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజలదే!.
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా