ప్రశాంతయుతంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు

ప్రశాంతయుతంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు

జనం న్యూస్ 09 మే
విజయనగరం
జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపిఎస్ గారు మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుత
వాతావరణంలో నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో మే 8న
సమావేశాన్ని నిర్వహించి, పోలీసు అధికారులకు దిశా నిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం. దీపిక,
ఐపిఎస్ గారు మాట్లాడుతూ - సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రతీ పోలీసు స్టేషను
పరిధిలోని గ్రామాలను సంబంధిత పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఇప్పటికే పలుమార్లు సందర్శించి, ఎన్నికల
మీటింగులు నిర్వహించి, స్థానిక ప్రజలు, నాయకులకు ఎన్నికల్లో వివాదాలకు దూరంగా ఉండాలని, జిల్లా పోలీసుశాఖ
చేపడుతున్న ముందస్తు చర్యలకు సహకరించాలని కోరామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1015 గ్రామాల్లో ఎన్నికల
మీటింగులు నిర్వహించి, ఎన్నికల నిబంధనలు, పాటించాల్సిన విధి, విధానాలు గురించి అవగాహన కల్పించామన్నారు.
అదే విధంగా కేంద్ర పోలీసు బలగాలు, స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు ఇప్పటికే 149 గ్రామాలను సందర్శించి,
ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా భరోసా కల్పించామన్నారు.
పోలింగు అనంతరం సంబంధిత పోలింగు కేంద్రాల నుండి ఈ.వి.ఎం.లను, ఎన్నికల మెటీరియల్ను సురక్షితంగా,
ఎటువంటి మార్గాటంకంలు కలగకుండా జె.ఎన్.టి.యు, మరియు లెండీ ఇంజనీరింగు కళాశాల్లోని ప్రాంగ్ రూంలకు
చేర్చాలన్నారు. ఈ.వి.ఎం.లను స్ట్రాంగు రూంలకు తరలించే క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా
చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ.వి.ఎం.లను పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల
వారీగా భద్రపర్చే విధంగా బారికేడ్లు, సందేహాలు తలెత్తకుండా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగు రోజున
పార్టీ అభ్యర్ధులు పాటించాల్సిన విధి, విధానాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ
ఆదేశించారు. పోలింగు కేంద్రాలకు 200మీటర్లు దూరంలో మాత్రమే పార్టీ కార్యకర్తలు ఉండే విధంగాను, ఎటువంటి
పార్టీ జెండాలు, గుర్తులు ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్లుకు ఇచ్చే ఓటరు స్లిప్పులపై ఎటువంటి పార్టీ
గుర్తులు, పార్టీ పేర్లు, పార్టీ రంగులు ఉండకుండా చూడాలన్నారు. పోలింగు రోజున 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉన్న
కారణంగా ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. పోలింగు కేంద్రాల వద్ద 100
మీటర్లు పరిధిలో ఓటు వేసే వ్యక్తులు మినహా ఇంకెవ్వరూ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల కమీషను
సూచించిన నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించే విధంగా చూడాలన్నారు. పోలింగు ముగిసిన తరువాత కూడా
గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, వివాదాలు చెలరేగకుండా గస్తీ, పెట్రోలింగు నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ
ఆదేశించారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, మరిన్ని
గ్రామాలను సందర్శించి గ్రామసభలు, ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించే విధంగాను, సమస్యలు సృష్టించే వ్యక్తులను మరోసారి
కౌన్సిలింగు చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలను ప్రశాంతయుతంగా
నిర్వహించేందుకు సుమారు 3000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక
తెలిపారు.
ఈ సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, బొబ్బిలి డిఎస్పీ పి. శ్రీనివాసరావు, సిఐలు కే.కే.వి.
విజయనాధ్, ఈ.నర్సింహమూర్తి, ఎం.శ్రీనివాసరావు, రవికుమార్, ఎన్.వి.ప్రభాకర్, బి. వెంకటరావు, కే.రామారావు
మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.