సరిగమపదనిస.. కరో కరో జల్సా..

సరిగమపదనిస.. కరో కరో  జల్సా..

జనం న్యూస్ 24 మర్చి 2024 జోగులాంబ గద్వాల్ టు గోవా..ఎంజాయ్ రా మామ..కుర్రాళ్ళోయ్ ..కుర్రాళ్ళు.. ఈ ప్రజా ప్రతినిధులు..ఎమ్మెల్సీ ఎన్నికలు తీరుస్తున్న సరదాలు..ప్రజా ప్రతినిధులుగా బోలెడంత డబ్బులు పెట్టి గెలిచారు.. ప్రగతి కోసం ఐదేళ్లు పరితపించారు.. సరైన నిధులు సమయాలనుకూలంగా అందక నిరసించారు.. కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి టైం వచ్చింది.. ప్రగతి కోసం కాదు.. సరదాల కోసం.. అందుకే చట్టాపట్టాలేసుకొని గోవా చెక్కేశారు..సరిగమపదనిస.. కరో కరో జల్సా అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.. గద్వాల్ మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధుల కథ ఇది. ఒక్కసారి పరిస్థితి పరిశీలిస్తే..

 స్వామి రారా.. 

ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు, పార్లమెంటు ఎన్నికలు మరోవైపు ఉండడంతో ప్రజా ప్రతినిధులకు డిమాండ్ పెరిగింది. ఛాన్స్ దొరికితే పిల్లి ఎలుకను పట్టుకున్నట్టు వీళ్లను పట్టుకొని కండువాలు కప్పి పార్టీ మార్చేస్తున్నారు. ఈ భయంతోనే పార్టీ అధినేతలతో పాటు అభ్యర్థులు తమ వర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యేదాకా యాత్రలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ పుణ్యక్షేత్రాలు కాదండోయ్.. గోవా లాంటి జల్సా ప్రాంతాలు.. ప్రస్తుతం గద్వాల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రజా ప్రతినిధుల అందరిని ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి గోవాకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం ప్రజాప్రతినిధులంతా ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 ఎందుకిలా..? 

ప్రస్తుతం అసెంబ్లీ పరిధిలో ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు.. ఇలా ఏ లెక్క తీసుకున్న బీఆర్ఎస్ కు అత్యధిక సంఖ్య ఉంది. గతంలో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలు కాబట్టి తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ఎక్కువ శాతం మందిని గెలిపించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు, మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో తమ బలాన్ని చూపించేందుకు పక్క పార్టీ మీద కన్నేసింది. అక్కడ అధికారంలో ఉన్న కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచుల కోసం గేట్లు తెరిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీలు కూడా మారారు. ఈ సంఖ్య మరింత పెరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగానే తమకు సంబంధించిన ప్రజాప్రతినిధులను టూర్లు తీసుకువెళ్లి అక్కడ ఎంజాయ్ చేయిస్తున్నారు. ఇదే ఛాన్స్ గా భలే చాన్సులే లక్కీ ఛాన్సులే.. అంటూ ప్రజాప్రతినిధులు కూడా తమ పని ఒత్తిడిని మరిచిపోయి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య జరుగుతున్న టామ్ అండ్ జెర్రీ ఆటలలో ప్రజా ప్రతినిధుల పంట పండిందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. క్యాంప్ రాజకీయాలతో నవీన్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా