హైదరాబాద్ లో దారుణం.. అప్పు కట్టలేదని తల మొండెం వేరు చేసి..ముక్కలు నరికి ఫ్రిడ్జ్ లో దాచాడు.
జనం న్యూస్: అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లించమని అడిగినందుకు ఓ నర్సును ముక్కలుగా నరికి చంపిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఈ కేసు వివరాలను డీసీపీ రూపేష్‌కుమార్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కలకలం సృష్టించిన మొండెం లేని తల.. ఆరు రోజుల క్రితం మలక్‌పేటలోని మూసీ పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్ కవరులో మొండెం లేని తలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు 8 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. ఒక్కో టీమ్‌లో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు.. ప్రతి మూడు టీమ్‌లకు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఏసీపీలు దర్యాప్తులో పాల్గొన్నారు.
దర్యాప్తు సాగిందిలా..
ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 750 పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులపై ఈ బృందాలు దృష్టి పెట్టాయి. ఎక్కడా ఎలాంటి కేసూ నమోదు కాలేదని గుర్తించారు. మొండెం లేని తల దొరకడానికి వారం రోజుల ముందు ఉన్న కొన్ని వందల సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో తల దొరికిన ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని గమనించారు. టెక్నికల్ టీమ్ సాయంతో నిందితుడు చంద్రమౌళి ఉండే ప్రాంతాన్ని గుర్తించారు.
ముక్కలుగా నరికి.. ఫ్రిజ్‌లో దాచి... నిందితుడు చంద్రమౌళి ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా.. మహిళ చేతులు, కాళ్లు, ఇతర అవయవాలు దొరికాయి. వాటిని నిందితుడు ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు. చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, హత్య చేసినట్టు అంగీకరించాడు. వాసన రాకుండా మృతురాలి శరీర భాగాలపై హంతకుడు కెమికల్స్, స్ప్రేలు వాడాడు. వాటన్నింటినీ సీజ్ చేసిన పోలీసులు వాటిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే.. మృతురాలి పేరు ఎర్రం అనురాధ (55). నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆమె నర్సుగా పనిచేసేది. పదేళ్ల క్రితం నిందితుడి తండ్రికి ఆమె పనిచేసే ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. అప్పటినుంచి వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే చైతన్యపురిలోని నిందితుడి ఇంట్లో గల గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గదిని నర్సుకు అద్దెకు ఇచ్చాడు. అనురాధ రెండు సంవత్సరాలుగా అక్కడే నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నుంచి నిందితుడు చంద్రమౌళి దఫ దఫాలుగా రూ.7 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. మరోపక్క అతను ఆన్లైన్ ట్రేడింగ్‌లో నష్టపోవడం వల్ల అప్పులపాలయ్యాడు.
డబ్బు కోసం నిలదీయడంతో... ఇటీవల అనురాధ డబ్బు తిరిగి ఇవ్వాలని చంద్రమౌళిని నిలదీస్తోంది. దీంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్న చంద్రమౌళి మే 12వ తేదీ మధ్యాహ్నం ఆమెతో గొడవ పడి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికేశాడు. ఇందుకోసం టైల్స్ కట్టర్, కత్తి ఉపయోగించాడు. శరీరం నుంచి తలను వేరు చేసి ఆటోలో తీసుకొచ్చి మలక్‌పేట వద్ద మూసీ నది పరీవాహక ప్రాంతంలో పడేశాడు. ముక్కలుగా నరికిన శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు. ఆ శరీర భాగాల ముక్కలను మాయం చేసేందుకు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా చూశాడు. ఆమె మృతిచెందిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని ఆమె ఫోన్ కూడా వినియోగించాడు. తెలిసిన వారికి మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఇంతలోనే పోలీసులు ఈ హత్య గుట్టు ఛేదించడంతో అతని బండారం బట్టబయలైంది.