అసెంబ్లీ ఎన్నికల అధికారులు సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు

అసెంబ్లీ ఎన్నికల అధికారులు సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు

జనం న్యూస్ 08 నవంబర్ 2023 :--- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఎన్నికల పరిశీలకులు అజయ్ వి.నాయక్, దీపక్ మిశ్ర, ఆర్. బాలకృష్ణన్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , జిల్లా ఎస్ పి రితి రాజ్ సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర ఈవిఎం యంత్రాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, అవసరమైతే అదనపు బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అందించడం జరుగుతుందని, నవంబర్ 18న రెండవ దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులను మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల తనిఖీలలో నగదు, బంగారం, ఇతర ఆభరణాలు జప్తు చేసే సమయంలో ఈ.ఎస్.ఎం.ఎస్ యాప్ లో క్షేత్రస్థాయిలో వెంటనే నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఎన్నికల ప్రచారం సంబంధించిసమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని , ఓటరు స్లిప్పుల పంపిణీ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభించాలని, జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రతిరోజు ఓటర్ స్లిప్పుల పంపిణీ పై సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.

*జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ డిస్ట్రిక్ట్*