ఉద్యోగం మానేసి మంత్రగత్తె గా మారింది.. కోట్లల్లో సంపాదన..! అసలు కథమేటి..?
జనం న్యూస్: మాయలు, మంత్రాలను నమ్మేజనం ఈ సమాజంలో చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే.. టెక్నాలజీ, ఎడ్యుకేషన్ ఎక్కువయ్యే కొద్దీ మూఢ నమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంత్రాలకు చింతకాయలు రాలతాయన్న దాన్ని పెద్దగా నమ్మటం లేదు. కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఇంకా మూఢ నమ్మకాలు అలానే ఉన్నాయి. దెయ్యాలు, బూతాలు, చేతబడుల వంటి వాటిని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ కారణంగానే మూఢ నమ్మకాల మీద నడిచే బిజినెస్‌లు బాగా సాగుతున్నాయి. ఈ బిజినెస్‌లోకి దిగిన వారు లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి.. మంత్రగత్తెగా మారిపోయింది. నెలకు లక్షల్లో సంపాదిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని లండన్‌కు చెందిన 29 ఏళ్ల జెస్సికా కాడ్‌వెల్ ఓ సెలూన్‌లో బ్యూటీషియన్‌గా పని చేస్తూ ఉండేది. 2019లో ఓ రోజు సోషల్ మీడియా వాడుతూ ఉండగా..
ఆమెకు ఓ పోస్టు కనిపించింది. అది పారానార్మల్ గ్రూపునకు సంబంధించింది. ఆ గ్రూపులోని వారు మానవాతీత శక్తుల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. తమకు ఎదురైన చేతబడుల అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు. దీంతో జెస్సికాకు క్షుద్ర విద్యలపై ఆసక్తి కలిగింది. వెంటనే క్షుద్ర విద్యలకు సంబంధించిన పుస్తకాలను కొంది. వాటిని చదివి మంత్రగత్తెగా మారిపోయింది. టరోట్ కార్డులు, క్రిస్టల్‌తో తన దగ్గరికి వచ్చే వారి భవిష్యత్తు ఏంటో చెబుతోంది. సెలూన్‌లో పనిచేయటం కంటే.. మంత్రగత్తెగా ఉండటంలోనే సంతోషం ఉండటంతో సెలూన్‌లో పనిని వదిలేసింది. పూర్తి స్థాయిలో మంత్రగత్తెగా మారిపోయింది. ఇప్పుడు ఆమె కంటూ 5 వేల మంది క్లైంట్స్ ఉన్నారు. నెలకు 7 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఇక, మంత్రగత్తె కావటంపై జెస్సికా మాట్లాడుతూ.. ‘‘ నేను ఎప్పుడూ ఓ మంత్రగత్తెనే.. కానీ, ఎప్పుడూ పరికరాలు ఉపయోగించి నా శక్తుల్ని వాడలేదు. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పని చేస్తున్నాను. భారీగా సంపాదిస్తన్నాను. సెలూన్‌లో పని వదిలేసినపుడు నా కుటుంబసభ్యులు, స్నేహితులు భయపడ్డారు. నాకు మంచి ఆదాయం రావటం చూసి వాళ్లు కూడా బాగా సపోర్టు చేస్తున్నారు. చాలా మంది తమ భాగస్వామి తమ గురించి ఏమనుకుంటోందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. నేను వారికి దారుణమైన నిజాలు చెబుతూ ఉంటాను. అంతేకాదు! నా దగ్గరికి వచ్చే చాలా మందికి ఇతరుల్ని ఎలా ఆకర్షించాలో చెబుతూ ఉంటాను’’ అని పేర్కొంది. మరి, ఉద్యోగం వదిలేసి మంత్రగత్తెగా మారిన జెస్సికా ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.