ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్

జనం న్యూస్ : నవంబర్ 22, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆర్టీఐ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ అన్నారు. బుధవారం ఢిల్లీ నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని 001-సిర్పూర్, 005-ఆసిఫాబాద్ నియోజకవర్గాలకు ఈనెల 30వ తేదీన జరగనున్న పోలింగ్ కొరకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల 2వ విడత రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, 001-సిర్పూర్ నియోజకవర్గంలో 294 పోలింగ్ కేంద్రాలు, 005-ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసి పూర్తి సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఎన్నికలు సజావుగా సాగేందుకు సెక్టోరల్ అధికారులకు ఇప్పటివరకు 5 సార్లు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందని, పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు 2 విడతలను శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 23, 24, 25 తేదీలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ సమీక్షలో ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.