నిబంధనల ప్రకారం పక్కాగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలి

నిబంధనల ప్రకారం పక్కాగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలి

--పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్

--గతం కంటే పోలింగ్ శాతం పెరిగేలా ప్రణాళికబద్ధంగా చర్యలు

--ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అవసరమైన మేర సదుపాయాల కల్పన

--ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు పాటిస్తూ నగదు, మద్యం, అభరణాల జప్తు ప్రక్రియ

--ఎన్నికల సందర్భంగా అనుమతులను నిష్పక్షపాతంగా అందించాలి

--బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ  అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేక ఫోకస్

--అక్రమ నగదు పంపిణీ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

--లోక్ సభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో  పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏ.ఆర్.ఓ లతో సమీక్షించిన పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్..

జనం న్యూస్ , మార్చి 22( సబ్బు సతీష్ ప్రతినిధి ) పెద్దపల్లి : 

నిబంధనల ప్రకారం పక్కాగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని, దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. 

శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పెద్దపల్లి పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్, జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్, మంచిర్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాహుల్, పెద్దపల్లి  అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ లతో కలిసి లోక్ సభ ఎన్నికల నిర్వహణపై ఏ.ఆర్.ఓ లతో సమన్వయ సమావేశాన్ని  నిర్వహించారు. 

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు రూపొందించుకున్న ప్రణాళికను ఈ సందర్భంగా ఏ.ఆర్.ఓ లు తెలియజేశారు. 

పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని,  పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్ అవగాహన కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణతో చేపట్టాలని అధికారులకు సూచించారు. మంచిర్యాల, రామగుండం వంటి అర్బన్ ప్రాంతాలలో ఓటరు నమోదు పెరిగేలా ప్రత్యేక కార్యక్రమలు అమలు చేయాలని అన్నారు. 

ప్రతి పోలింగ్ కేంద్రంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మేర సదుపాయాలు కల్పించాలని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్లు , పోలింగ్ కేంద్రాలకు త్రాగునీటి సౌకర్యం మొదలగు పనులు నిబంధనలు పాటిస్తూ చేపట్టాలని అన్నారు.  ప్రతి ఒక్క ఓటరుకు ముందస్తుగా ఓటర్ స్లిప్పులు అందేలా చూడాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు. 

ఎన్నికల సమయంలో ప్రచార సభల నిమిత్తం వీలైనంత వరకు విద్యా సంస్థల మైదానాలను కేటాయించవద్దని అన్నారు.  ఎన్నికల సమయంలో నగదు, ఆభరణాలు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తప్పని సరిగా పాటించాలని, సామాన్యులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు.  పార్లమెంట్ పరిధిలో విధులు నిర్వహించే ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఇతర బృందాలకుఅవసరమైన శిక్షణ అందించాలని, 24 గంటల పాటు 3 షిప్టులలో ఎన్నికల విధులు జరగాలని , ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి  లో పని తీరు లైవ్ కెమేరాల ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల పరీశీలకులు గమనిస్తున్నందున వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 

జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అన్నారు.  జిల్లాలో రైల్వే స్టేషన్లో, బస్టాండ్ లో ప్రత్యేకంగా ఉంటే అక్కడ తప్పనిసరిగా ఒక ఎస్.ఎస్.టి ఏర్పాటు చేయాలని అన్నారు.  ఎస్.ఎస్.టి లను ఒకేచోట కాకుండా ప్రతి 20 రోజులకు లోకేషన్ మార్పు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అనుమానస్పద లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు అధికారులకు అందించేలా చూడాలని అన్నారు. 

ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జరగాలని అన్నారు.  ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ హక్కు వినియోగించే అవకాశం కల్పించాలని  కలెక్టర్ సూచించారు. ఈవీఎం యంత్రాలు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను పక్కాగా ఏర్పాటు చేయాలని అన్నారు. సెక్టార్ అధికారులు క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకొని వారి విధులు పక్కగా నిర్వహించేలా చూడాలని సూచించారు. 

ఎన్నికల సందర్భంగా అవసరమైన అనుమతులను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏ.ఆర్.ఓ లు అందిస్తారని, హెలిపాడ్ అనుమతులను ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా ఎన్నికల అధికారులు అందిస్తారని, పార్లమెంటు స్థాయి వాహన అనుమతులు రిటర్నింగ్ అధికారి కార్యాలయం అందిస్తుందని, ప్రచార వాహనాలు అనుమతులు ఏ.ఆర్.ఓ, వాహనాలలో ప్లే చేసే కంటెంట్ కు ఎంసిఎంసి కమిటీ అనుమతి తప్పనిసరి అన్నారు. 

సి-విజల్ యాప్ విస్తృతంగా వినియోగించేలా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో ఉన్న బెల్టు షాపులను అరికట్టాలని, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం వల్నరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ తప్పనిసరిగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. 

ఈ సమావేశంలో మంచిర్యాల, చెన్నూర్, మంథని, పెద్దపల్లి ఆర్డీవోలు, డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్, కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.